ఇరిగేషన్ "సై"... ఉద్యోగులు "నై"
రాజధానికి మకాం మార్చండని ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆదేశాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. దీనికి ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా కుటుంబాలను ఎలా తరలిస్తామని, ముందు ఉండడానికి కావలసిన సదుపాయాలు కల్పించి తర్వాత అక్కడకు వెళ్ళమంటే తమకు అభ్యంతరం లేదని ఉద్యోగులంటున్నారు. అవసరమైతే ఆందోళనకయినా దిగుతాముకాని వెంటనే తరలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఏపీ నీటిపారుదల […]
రాజధానికి మకాం మార్చండని ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆదేశాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. దీనికి ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా కుటుంబాలను ఎలా తరలిస్తామని, ముందు ఉండడానికి కావలసిన సదుపాయాలు కల్పించి తర్వాత అక్కడకు వెళ్ళమంటే తమకు అభ్యంతరం లేదని ఉద్యోగులంటున్నారు. అవసరమైతే ఆందోళనకయినా దిగుతాముకాని వెంటనే తరలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జల వనరుల శాఖను తక్షణమే విజయవాడ కు తరలించాలని మంగళవారం ఆదేశించారు. మంత్రి ఆదేశాలపై జలవనరుల శాఖ పరిపాలనా విభాగం ఇంజనీరింగ్ చీఫ్ ఆగమేఘాలపై స్పందించారు. తక్షణమే ఫైళ్లను సర్దుకొని, విజయవాడ వెళ్లేందుకు సిద్ధం కావాలని సర్క్యులర్ జారీ చేశారు. ఫైళ్లు, ఫర్నీచర్, ఇతర సామగ్రిని విజయవాడకు తరలించేందుకు ఎంత మంది మనుషులు అవసరమో తెలియజేయాలని కోరారు. జల వనరుల శాఖలోని 9 విభాగాల ప్రధానాధికారులకు ఈ సర్క్యులర్ జారీ అయింది. ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్‌సీ), కమిషనర్ ఆఫ్ టెండర్స్( సీఓటీ), మీడియం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, ఐఎస్‌డబ్ల్యూఆర్ చీఫ్ ఇంజనీర్, డిజైన్స్ చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్, హెచ్‌ఆర్‌డీ చీఫ్ ఇంజనీర్, ఏడ బ్ల్యూ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, పీఅండ్‌ఎం ఎస్‌ఈ కార్యాలయాలను విజయవాడకు తరలించేందుకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. కాగా, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించకుండా జలవనరుల శాఖ కార్యాలయాలను విజయవాడకు తరలించడంపై ఆంధ్రా ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉన్నపళంగా విజయవాడ వెళదామంటే అక్కడ ఇళ్లను వెతుక్కునే విషయం నుంచి పిల్లల చదువుల వరకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, ఇలా ఇప్పటికిప్పుడు వెళ్ళడం సాధ్యం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అవసరమైతే ఆందోళనలకూ సిద్ధమవ్వాలని భావిస్తున్నారు.
కొసమెరుపు: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలాలన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాన్ని ఉద్యోగులు ధిక్కరించి జల మండలి వద్ద ఆందోళనకు దిగడంతో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ చర్చలు జరిపారు. ఆందోళన విరమించాల్సిందిగా విన్నవించారు. రాజధానికి వెళ్ళాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అయితే కనీస వసతులు లేకుండా అక్కడికి వెళ్ళి పని చేయడం సాధ్యం కాదని వారు తేల్చి చెప్పారు. దీంతో ఉద్యోగుల తరలింపు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు తమ ఆందోళనను విరమించి విధులకు హాజరయ్యారు.