బాబు కోటరీ నుంచి సీఎం రమేష్ ఔట్.. ?
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంపి సిఎం రమేష్‌ల మధ్య రాజకీయ సంబంధాలు ఎందుకు బెడిసికొట్టాయి ? రమేష్‌ను ముఖ్యమంత్రి ఈ మధ్య కాలం నుంచి ఎందుకు దూరంపెడుతున్నారు ? వారిద్దరు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. కాని ఈ మధ్య కాలంలో వారిమధ్య దూరం పెరిగింది. గత కొంత కాలంగా ఈ విషయం ప్రచారంలో ఉన్నప్పటికీ ఇటీవల బహిరంగమయింది. మే9న కడపజిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించినప్పుడు […]
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంపి సిఎం రమేష్‌ల మధ్య రాజకీయ సంబంధాలు ఎందుకు బెడిసికొట్టాయి ? రమేష్‌ను ముఖ్యమంత్రి ఈ మధ్య కాలం నుంచి ఎందుకు దూరంపెడుతున్నారు ? వారిద్దరు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. కాని ఈ మధ్య కాలంలో వారిమధ్య దూరం పెరిగింది. గత కొంత కాలంగా ఈ విషయం ప్రచారంలో ఉన్నప్పటికీ ఇటీవల బహిరంగమయింది.
మే9న కడపజిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించినప్పుడు నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో ‘నీరు చెట్టు’ అమలును సమీక్షించారు. ఎంపి రమేష్‌ను ఉద్దేశించి సిఎం చేసిన వాఖ్యలతో ఆ విషయం బలపడింది. సిఎం రమేష్‌నుద్ధేశించి ‘సిఎం రమేష్ ఎన్ని చెరువులు పరిశీలించావు ?డిల్లీలో ఉంటే ఎలా చూస్తావ్ ? గ్రామాల్లో తిరుగుతుండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. గాలిలో తిరుగుతుంటే ప్రయోజనంలేదు.’ అని చంద్రబాబు ఆయనకు నేరుగా చురకలంటించారు. శని, ఆదివారాలు మాత్రమే తాను వెళుతున్నానని రమేష్ చెప్పబోతుండగా, ‘నిత్యం ప్రజలతో ఉంటేనే ఓట్లు వేయటంలేదు. ఇలా అయితే ఎలా వేస్తారు… అందుకే ఓడిపోతున్నాం, ప్రభుత్వం ప్రత్యేకంగా నీరు చెట్టు కార్యక్రమాన్ని ఇంతగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే మీరు పట్టించుకోకపోతే ఎలా’ అంటూ చంద్రబాబు రుసరుసలాడారు. అనంతరం మరికొందరు నాయకులను ప్రశ్నించారు. అయితే రమేష్‌ను ప్రశ్నించిన తీరు ఆసక్తికరంగామారి చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర, జిల్లా అధికారులకు, పార్టీ యంత్రాంగానికి స్పష్టమైన సంకేతాలు పంపించాలనే ఆయన ఆవిధంగా ఎంపికి బహిరంగంగా చురకలంటించినట్లు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రమేష్‌ను చంద్రబాబు దూరంగా ఉంచటానికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చోటుచేసుకున్న పలుపరిణామాలు కారణమయ్యాయి.
తొలినుంచి రమేష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నప్పటికీ 2009, 2014 ఎన్నికల సమయాల్లో సిఎంకు అత్యంత సన్నిహితంగా చంద్రబాబు కోటరీలో ముఖ్యునిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు సుజనాచౌదరి, సిఎం రమేష్, నారాయణలతో పాటు లోకేష్ బృందం కోటరీగా పనిచేసింది. ఆ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడగా సుజనాచౌదరి, నారాయణలు పార్టీకి అవసరమైన నిధులు సమీకరించటంలో కీలకపాత్రను నిర్వహించారు. దాంతో వారి కృషికి తగిన విధంగానే వారిద్దరికీ మంత్రి పదవులు లభించాయి. కేంద్రమంత్రివర్గ విస్తరణలో భాగంగా సుజనాకు పదవిని బాబు ప్రతిపాదిస్తే మోడి కేటాయించారు గాని అంతగా ప్రాధాన్యతలేని శాఖను కేటాయించారు. ఇక నారాయణకు రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన స్థానం అప్పగించారు. విజయవంతమైన వ్యాపార విద్యావేత్తగా పేరొందిన నారాయణ రాజకీయాలలోగాని వ్యక్తిగతంగాగాని ఎవ్వరికీ సహాయం చేయరనే అభిప్రాయం పార్టీ, అధికార వర్గాల్లో బలంగా ఉంది. కాని చంద్రాబాబును తిరిగి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేందుకు మాత్రం వ్యయప్రయాసలుకోర్చారు. అందుకు రాష్ట్ర రాజధాని నిర్మాణం పర్యవేక్షించే మంత్రిత్వశాఖను అప్పగించారు. ఇక సిఎం రమేష్ విషయానికి వస్తే అప్పటికే ఆయన ఎంపి (రాజ్యసభ) అయ్యారు. సిఎం విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా ఆయన కూడా బృందంలో ఉండే విధంగా బాబు చూసుకున్నారు. కాని ఇటీవల కాలంలోనే అంతరం పెరిగింది.
అందుకు పలుకారణాలు పార్టీ ముఖ్యనాయకుల్లోనే చర్చనీయాంశమయ్యాయి. రమేష్ కేంద్రంలో బిజెపితో అత్యంత సఖ్యంగా ఉంటూ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారట! ఓవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం, బిజెపి సహకరించటంలేదు. అయినా ఆయన మాత్రం తన పలుకుబడి ఉపయోగించుకుని సొంతపనులు చేయించుకుంటున్నారని చంద్రబాబు దృష్టికి ఆధారాలతో సహా వచ్చాయని ఓ ముఖ్యనాయకుడు చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో క్రియాశీల పాత్రను నిర్వహిస్తున్న ఓ మహిళా మంత్రితో ఆయనకు రాజకీయంగా సంబంధాలు బాగున్నాయి. ఆ మంత్రిణికి ప్రధానమంత్రి మోడి కోటరిలో స్థానం ఉండటంతో రమేష్ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయని సిఎం దృష్టికి కొందరు పార్టీనాయకులు తీసుకువచ్చారు. దాంతో చంద్రబాబు కొంతకాలంగా అసహనానికిలోనై రెండు సందర్భాలలో ఆ ఎంపి దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనలో ఏమాత్రం మార్పురాలేదని బాబు గుర్తించారని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. అందుకే గ్రామాల్లో తిరగకుండా గాల్లో డిల్లీకి చక్కర్లు కొడితే ఎలాగని ఇటీవల కడపలో అధికారుల సమక్షంలోనే పరోక్షంగా ఎద్దేవా చేశారు.
ఇటీవల సిఎంతోపాటు ఎంపి చైనా పర్యటనకు వెళ్ళారు. ఆ సమయంలో పర్యటనపై దృష్టి ఉంచకుండా రాష్ట్రంలో ఒలింపిక్ అధ్యక్షుని ఎన్నికపైనే దృష్టి సారించి కాలం గడిపారట. మొత్తం సమయమంతా అక్కడి నుంచి ఫోన్‌లోనే రాష్ట్రంలో ఒలింపిక్ సంఘానికి సంబంధించిన వారితో మాట్లాడేవారని తెలిసింది. తాను అధ్యక్ష పదవి ఆశించటంతో పోటీకి దిగుతున్న మరో ఎంపి గల్లా జయదేవ్‌ను అడ్డుకునేందుకు అక్కడి నుంచే ఆయన చక్రం తిప్పారు. దీంతో బాబు ఆయనను మందలించారని తెలిసింది. సిఎం ఆదేశాల మేరకే ఆయన పోటీనుంచి తప్పుకుని గల్లా గెలుపొందేలా కృషి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రమేష్‌కు అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపితోపాటు ఆయన తనయుడు సహకరించిన తీరు బాబు ఆగ్రహానికి కారణమయ్యింది. వారిద్దరూ డిల్లీలో ఎంపి పైరవీలకు సహకరిస్తుండటం బాబుగారికి ఏమాత్రం నచ్చలేదని తెలిసింది.
అలాగే రాష్ట్రంలోనూ, జిల్లాల్లోనూ అధికారులపై పెత్తనం చేసే విధంగా రమేష్ వ్యవహరిస్తున్నారని కొందరు అధికారులు, నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారని తెలిసింది. గుంటూరు, కృష్ణ(విజయవాడ), నెల్లూరు తదితర జిల్లాల్లో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి ఆయన పాత్ర వివాదాస్పదం కావటంతో సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. వీటికి తోడు చిత్తూరు, కడప జిల్లాల పార్టీ వ్యవహారాలలో ఆయన అతిగా జోక్యం చేసుకుంటూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు అసంతృప్తికి లోనైనట్లు వినవచ్చింది. ముఖ్యంగా కడప జిల్లాలో ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో అతిగా జోక్యం చేసుకుని ఓ నాయకుడిని ప్రోత్సహిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలతో సహా పలువురు నాయకులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నీ కలిసి రమేష్‌ను బాబు దూరం పెట్టేలా చేశాయి. అయితే పార్టీ విజయం కోసం ఆయన కూడా పనిచేశారు. కాని నారాయణ, సుజనా తరహాలో నిధులు సమకూర్చటంలో కీలకపాత్ర పోషించకపోగా గతం నుంచే తనదైన శైలిలో వ్యవహారాలు చక్కబెట్టుకున్నారని, ఆర్థిక వ్యవహారాల పరంగా చూసినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ రమేష్ జోక్యాన్ని పెంచకూడదని ముఖ్యమంత్రి భావించినట్లు పార్టీనాయకుల్లో చర్చ జరుగుతుంది.