ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలు?
హైదరాబాద్: తమిళనాడు తరహాలో మద్యం విధానం ఉండాలని… ప్రభుత్వమే మద్యం విక్రయాలను చేపట్టాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. కొత్త ఎక్సైజ్ విధానంపై శుక్రవారం ఏపీ కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. జులై 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయాలంటే ఎలా ముందుకెళ్ళాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో చర్చకు పెట్టారు. మంత్రులంతా తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. సుదీర్ఘ చర్చ అనంతరం తమిళనాడు తరహాలో కొత్త విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి […]
Advertisement
హైదరాబాద్: తమిళనాడు తరహాలో మద్యం విధానం ఉండాలని… ప్రభుత్వమే మద్యం విక్రయాలను చేపట్టాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. కొత్త ఎక్సైజ్ విధానంపై శుక్రవారం ఏపీ కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. జులై 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయాలంటే ఎలా ముందుకెళ్ళాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో చర్చకు పెట్టారు. మంత్రులంతా తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. సుదీర్ఘ చర్చ అనంతరం తమిళనాడు తరహాలో కొత్త విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం చాలా ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా మద్యం షాపులు ఉన్నాయి. వీటి లైసెన్స్ జూన్ 30తో ముగుస్తుంది. వీటి లైసెన్సులు పునరుద్ధరించాలా… లేక కొత్త ఎక్సైజ్ విధానం ఎలా ఉంటే బావుంటుంది… అన్న అంశంపై ఇటీవల ఎక్సైజ్ అధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తే… అది తమిళనాడు విధానం అవుతుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నిధులు సమకూరుతాయని ఆ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. కేబినెట్ చర్చ అనంతరం కొత్త పాలసీని వారం రోజుల్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం విధానం ఎలా ఉందన్న విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా రాష్ల్రాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా, చంద్రబాబు ముందుగా తాను సేకరించిన విషయాల ప్రాతిపదికగా ఆనాడే కొత్త ఎక్సైజ్ విధానంపై ఓ అవగాహనకు వచ్చారు.
దక్షిణాది రాష్ట్రాల విషయాన్ని పరిశీలిస్తే కేరళలో సహకార సొసైటీల ద్వారా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారు. అదే కర్ణాటకలో అయితే సగం ప్రభుత్వం, సగం ప్రయివేటు వ్యక్తుల చేతిలో మద్యం షాపుల నిర్వహణ జరుగుతుంది. ఢిల్లీలో కూడా ఇదే విధానం. ఒక్క తమిళనాడులో మాత్రం పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం రావడంతోపాటు నేరాల సంఖ్య తగ్గినట్టు ఎక్సైజ్ మంత్రి అధ్యయనంలో తెలింది. పైగా మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై ఎక్కువగానే కసరత్తు చేసింది. 2014-15లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ. 11,488 కోట్లుంది. దీన్ని వచ్చే యేడాది రూ. 12,258 కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గతంలో మాదిరిగా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోనే మళ్ళీ షాపులు వెళితే మరో రూ. 800 కోట్లు వారి నుంచి అదనంగా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలతోను, చర్చావేదికలపైన ప్రభుత్వం ప్రతిపాదిత విధానాన్ని చర్చకు పెట్టాలని భావిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోవడానికి మరో వారం సమయం వేచి చూడాలని భావిస్తోంది. ప్రస్తుతమున్న విధానానికి సీఎం చంద్రబాబు సుముఖంగా లేరన్న విషయం పరోక్షంగా తెలుస్తుంది కాబట్టి ఇక తమిళనాడు మోడల్‌నే ఏపీలో అమలు చేయడం దాదాపు ఖాయమైపోయినట్టే. కాని దీనికి ప్రజలతో మమ అనిపించడం ఒక్కటే మిగిలింది. బహుశా అందుకే ఈ వారం రోజుల వ్యవధిని ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆశిస్తున్నట్టు భావించవచ్చు. ఒకనాడు రాష్ట్రంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించిన తెలుగుదేశం ప్రభుత్వం ఇపుడు ఏకంగా తనే అమ్మకాలు చేపట్టాలని భావించడం చూస్తే ప్రజల ఆరోగ్యంపై కన్నా రాష్ట్ర ఆదాయంపైనే చంద్రబాబుకు మమకారం ఎక్కువనే విషయం స్పష్టమవుతోంది. -పీఆర్
Advertisement