టీ-ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ అనివార్యం!
తెలంగాణ ఎమ్మెల్సీల స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఆరు స్థానాలకు మొత్తం ఏడు నామినేషన్లు పడ్డాయి. ఇందులో గ్యారంటీగా టీఆర్ఎస్‌కు నాలుగు స్థానాలు, కాంగ్రెస్‌కు ఒక స్థానం, తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం దక్కాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో ఐదో స్థానం తమకే దక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది. కాని పార్టీ నుంచి బయటకు వెళ్ళినా వారింకా తమ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు కాబట్టి ఆ ఒక్క […]
Advertisement
తెలంగాణ ఎమ్మెల్సీల స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఆరు స్థానాలకు మొత్తం ఏడు నామినేషన్లు పడ్డాయి. ఇందులో గ్యారంటీగా టీఆర్ఎస్‌కు నాలుగు స్థానాలు, కాంగ్రెస్‌కు ఒక స్థానం, తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం దక్కాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో ఐదో స్థానం తమకే దక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది. కాని పార్టీ నుంచి బయటకు వెళ్ళినా వారింకా తమ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు కాబట్టి ఆ ఒక్క స్థానం తమకే వస్తుందని తెలుగుదేశం ధీమాగా ఉంది. తలసాని శ్రీనివాస యాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించినా వారు టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఇప్పటికీ ఉన్నారు కాబట్టి విప్ జారీ ద్వారా వారిని తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయించగలమని తెలుగుదేశం భావిస్తోంది. విప్ ఉల్లంఘిస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా వారిపై అనర్హత వేటు వేయవచ్చని, ఇప్పటికే తాము స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీకి 2004 నుంచి పని చేస్తున్న వేం నరేంద్రరెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి నామినేషన్ వేయించింది టీడీపీ. అంతా అనుకున్నట్టే జరిగితే వేం నరేంద్రరెడ్డి గెలవడం ఖాయం. అయితే నరేంద్రరెడ్డికి ఇవ్వడం పట్ల అరికెల నర్సారెడ్డి అలిగి కూర్చున్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఆయన నిజామాబాద్ జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
బలం లేకుండానే టీఆర్ఎస్ ఐదో అభ్యర్థి
టీఆర్ఎస్ మాత్రం కొంతమంది క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారని, తమ పార్టీ అయిదో అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తారని భావిస్తోంది. పైగా తమకు ఎం.ఐ.ఎం మద్దతు లభిస్తుందని… దీనివల్ల కేవలం ఒక్క ఓటు మాత్రమే తగ్గుతుందని అది ఎలాగోలా సాధిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. తగిన సంఖ్యాబలం లేకుండా అయిదో అభ్యర్థిని నిలబెట్టడంపై కాంగ్రెస్ టీఆర్ఎస్‌పై కారాలుమిరియాలు నూరుతోంది. ఇది అనైతికమని, అవినీతిని ప్రోత్సహించడం అని విమర్శిస్తోంది. మొదటి మూడు స్థానాలకు ముందే టీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు ఖరారై పోయారు. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగరరావులు ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాలుగో అభ్యర్ధి బి.వెంకటేశ్వర్లు. ఐదో అభ్యర్థిగా యాదవరెడ్డి బరిలో నిలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఉంటే టీఆర్ఎస్ సమర్థించే అవకాశం కొంత కనిపించింది. ఈ విషయాన్ని మాట్లాడడానికి బీజేపీ నాయకులు కూడా చంద్రబాబుతో సంప్రదించారు. కాని ఆయన అంగీకరించక పోవడంతో ఈ సంకేతాలు టీఆర్‌ఎస్‌ను ఐదో అభ్యర్థిని నిలపడం కోసం ప్రేరేపించాయంటున్నారు. బీజేపీ అభ్యర్థిని తెలుగుదేశం నిలిపి ఉంటే ఆ పార్టీకి మద్దతివ్వడం ద్వారా రెండు ప్రయోజనాలు పొందవచ్చని కేసీఆర్ భావించారు. ఒకటి బీజేపీకి బాసటగా ఉన్నట్టు కనిపించడం తద్వారా కేంద్రంలో ఆ పార్టీతో చెలిమికి మార్గం సుగమం చేసుకోవడం అయితే రెండోది తెలుగుదేశం ఉనికి విధాన మండలిలో లేకుండా చేయడం. ఇది గ్రహించిన చంద్రబాబు తనదైన శైలిలో వ్యవహారం చక్కబెట్టి తనపార్టీ సభ్యుడికే ఎమ్మెల్సీ సీటు ఇచ్చి టీఆర్ఎస్ వ్యూహానికి చిల్లు పెట్టారు. కేసీఆర్ రాజకీయ విలువలను తుంగలో తొక్కి బేరసారాలకు అవకాశం కలిగే విధంగా ఐదో అభ్యర్థిని రంగంలోకి దింపారని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు.
కాంగ్రెస్‌లో కొత్త సమస్య
కాగా కాంగ్రెస్‌కు తెలంగాణలో ఒక్క సీటు గ్యారంటీగా రానుండడంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలితను ఎమ్మెల్సీ పీఠంపై కూర్చోబెట్టడానికి అధిష్టానం నిర్ణయించింది. ఆమె నామినేషన్ కూడా వేశారు. దీంతో జానారెడ్డి, దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి వంటి వారు అలిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వ్యక్తిని కాకుండా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని దానం ఘాటుగా కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఒకవేళ మహిళకే ఇవ్వాలనుకుంటే నగరంలోని 14 నియోజకవర్గాల్లో పట్టున్న సబితా ఇంద్రారెడ్డికి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. పొన్నాల, డి.శ్రీనివాస్‌లు సీనియర్ నాయకులు. తనకు ఇవ్వకపోయినా వారికి ఇచ్చినా బాగుండేది అంటూ తనకివ్వలేదన్న బాధను పరోక్షంగా వ్యక్తం చేశారు. మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధిష్టానానికి లేఖ కూడా రాశారు.-పీఆర్
Advertisement