బాబూ... అలా ముందుకు వెళ్ళండి: పవన్‌కల్యాణ్
భూ సేకరణ చట్టాన్ని బలవంతంగా రైతులపై రుద్దితే చూస్తూ ఊరుకోలేనని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాజధానికి భూములు సమీకరించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన భూ సేకరణ ఆదేశాలపై కల్యాణ్ స్పందించారు. ప్రజలను ఇబ్బంది పెట్టి భూములను సేకరించవద్దని, వారిని ఒప్పించి మాత్రమే భూములు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు భూ సేకరణ ఎందుకు జరుపుతున్నామో, దానివల్ల ఒనగూరే లాభనష్టాలేమిటో వివరించాలని ఆయన కోరారు. రాజధాని […]
Advertisement
భూ సేకరణ చట్టాన్ని బలవంతంగా రైతులపై రుద్దితే చూస్తూ ఊరుకోలేనని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాజధానికి భూములు సమీకరించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన భూ సేకరణ ఆదేశాలపై కల్యాణ్ స్పందించారు. ప్రజలను ఇబ్బంది పెట్టి భూములను సేకరించవద్దని, వారిని ఒప్పించి మాత్రమే భూములు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు భూ సేకరణ ఎందుకు జరుపుతున్నామో, దానివల్ల ఒనగూరే లాభనష్టాలేమిటో వివరించాలని ఆయన కోరారు. రాజధాని నిర్మాణం చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై తనకెలాంటి సందేహాలు లేవని, అయితే రైతులు నష్టపోయే చర్యల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందని, ఫలితంగా భవిష్యత్‌లో పార్టీ నష్టపోవాల్సి వస్తుందని ఆయన నచ్చజెప్పే దోరణిలో హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం తాను అనుకున్నట్టే ముందుకు వెళ్ళాలనుకుంటే దానివల్ల నష్టపోయేది తెలుగుదేశం పార్టీయేనన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ ఇంతకుముందు కూడా భూములను బలవంతంగా సేకరించవద్దని ప్రభుత్వానికి సూచించారు. తన గుంటూరు పర్యటనలో కూడా భూములు బలవంతంగా లాక్కుంటే తాను మీ వెంటనే ఉంటానని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని రైతులకు హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రభుత్వం ఎవరి నుంచీ భూములు బలవంతంగా తీసుకోవడం లేదని చెప్పారు. దాంతో ఆయన విమర్శల పాలయ్యారు. భూములు బలవంతంగా తీసుకోవడానికి ఇపుడు నేరుగా ప్రభుత్వమే 166 జీ.వో. తీసుకురావడం ఆయనకు అసలు విషయం తెలిసి వచ్చినట్టయింది. దీంతో ఆయన మళ్ళీ ప్రకటన చేశారు. రైతులను ఒప్పించి మాత్రమే భూములను తీసుకోవాలని, దానివల్ల ఎవరికీ ఏ ఇబ్బందులూ ఉండవని చెప్పడం వెనుక పరోక్ష హెచ్చరిక ఉందనే చెప్పాలి. ఒకవేళ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం పవన్ రంగంలోకి దిగడం ఖాయం. ఈ పరిస్థితిని మిగతా పక్షాలు కూడా అందిపుచ్చుకుంటాయి. ఫలితంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడం ఖాయం. ఇప్పటికే వామపక్షాలు ఈ విషయమై ప్రత్యేకంగా ప్రకటన కూడా చేశాయి. బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితి వస్తే తామంతా ఉద్యమిస్తామని, అన్ని పక్షాలను కలుపుకుని ఉద్యమం నడుపుతామని హెచ్చరించాయి.
మరోవైపు అన్నా హజారే, మేథాపాట్కర్ వంటి నాయకులు కూడా రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలబడే మాటలు చెప్పారు. అవసరమైతే రాజధాని ప్రాంతంలో బహిరంగ సమావేశం నిర్వహించడం, నిరాహార దీక్షలకు దిగడం వంటి హెచ్చరికలు కూడా చేశారు. అన్నాహజారే అయితే మరో అడుగు ముందుకేసి చంద్రబాబుకు నేరుగా లేఖనే రాశారు. మూడు పంటలు పండే పంట భూములను నాశనం చేయొద్దని, నిర్వాసిత భూముల్లో నిర్మాణాలు చేపట్టడం మంచిది కాదని, అలాగే బంగారం పండే పంటలను నిర్మాణ భూములుగా మార్చడం వల్ల కరవు కాటకాలు రావడానికి మార్గం వేసినట్టేనని ఆయన హెచ్చరించారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో పర్యటించి స్వయంగా పరిస్థితులను చూస్తానని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాలన్నింటిని పెడచెవిన పెట్టి ముందుకుసాగితే నష్టపోయేది మాత్రం ప్రభుత్వ పరువు ప్రతిష్టలేననడంలో సందేహం లేదు. -పీఆర్
Advertisement