ఏపీతో ఆడుకుంటున్న కేంద్రం..
కేంద్ర ప్రభుత్వాలకు రాష్ర్టాలను వేధించడం, సాధించడం మామూలే. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడు మొదలైన ఈ సాధింపుల వ్యవహారం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉందన్న దాంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడం షరా మామూలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో పదేళ్ళ పాటు నాన్చిన యూపీఏ ప్రభుత్వం ఆఖరి నిమిషంలో హడావుడిగా, అడ్డగోలుగా వ్యవహరించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను దిక్కులేని రాష్ట్రంగా వదిలేసింది.తన పదేళ్ళ పాలనలో ఆఖరి పార్లమెంట్ […]
Advertisement
కేంద్ర ప్రభుత్వాలకు రాష్ర్టాలను వేధించడం, సాధించడం మామూలే. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడు మొదలైన ఈ సాధింపుల వ్యవహారం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉందన్న దాంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడం షరా మామూలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో పదేళ్ళ పాటు నాన్చిన యూపీఏ ప్రభుత్వం ఆఖరి నిమిషంలో హడావుడిగా, అడ్డగోలుగా వ్యవహరించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను దిక్కులేని రాష్ట్రంగా వదిలేసింది.తన పదేళ్ళ పాలనలో ఆఖరి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటకు సంబంధించిన బిల్లును అత్యంత నిరంకుశ రీతిలో ఆమోదింపచేసుకుంది. దానికి బీజేపీ వంతపాడింది. రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు విలువ లేకుండా చేశాయి. అధికార పదవుల కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధంగా ఉండే ఏపీకి చెందిన కేంద్రమంత్రులు ఢిల్లీలో కుక్కిన పేనుల్లా పడి ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆడింది ఆటలా నడిచిపోయింది. ఇందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు చరిత్రలో మరిచిపోలేని గుణపాఠం చెప్పారు. కోమాలో ఉన్న కాంగ్రెస్ తిరిగి లేస్తుందో లేదో కూడా డౌటే.
ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపై ఏడాదిగా కాంగ్రెస్ పద్దతిలోనే నడుస్తోంది. ఇస్తుందో చెప్పదు, ఇవ్వదో చెప్పదు. ఆఖరికి నాలుగు రోజుల క్రితం ఇచ్చే అవకాశం లేదని లిఖితపూర్వకంగా లోక్‌సభలోనే తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్రమంతటా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటటంతో ఇవ్వనని చెప్పలేదంటూ మాట మార్చింది. ఆదివారం నాడు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యేక హోదా ఇస్తామని, అయితే ఎప్పుడిస్తామో చెప్పలేమని నీళ్ళు నమిలారు. ఏపీకి కోడలైన ఈ తమిళనేతను టీడీపీ అధినేత చంద్రబాబే తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చి రాజ్యసభకు పంపించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ ఎంపీ అయినా తెలుగుదేశం దయతో గెలిచాననే విషయం కూడా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం కూడా మర్చిపోకూడదు. ఇతర రాష్ర్టాలకు చెందిన ఎంపీలు ఎవరైనా తమ రాష్ర్టానికి అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా పార్లమెంట్‌లో హడావుడి చేయడం తమకు కావాల్సింది సాధించుకోవడం చూస్తూనే ఉన్నాం. కేవలం ఏపీకి చెందిన ఎంపీలు మాత్రమే ఎన్నడూ రాష్ట్రం గురించి పెద్దగా పట్టించుకోరనే విమర్శ ఉంది. తమ వ్యాపార ప్రయోజనాల ముందు వారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడంలేదు. తమిళనాడు నుంచి వచ్చి ఏపీ నుంచి ఎంపీ అయిన నిర్మలా సీతారామన్ కూడా అదేతీరులో వ్యవహరిస్తున్నారు.
ఇక మరో కేంద్ర మంత్రి సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెండు చోట్ల మీటింగ్‌ల్లో పాల్గొన్నా ప్రత్యేక హోదా గురించి ఎవరూ ప్రస్తావించలేదు. ఆ సమస్య అనేది ఒకటుందనే విషయం కూడా ఇద్దరికీ తెలియనట్లుగానే ప్రవర్తించారు. అసలు ముఖ్యమంత్రికే లేనపుడు ఇతరులకు ఎందుకుంటుంది.
Advertisement