నెహ్రూ బోస్ విభేదాలు మిథ్య

స్వాతంత్ర్యానంతరం నేతాజీ సుభాశ్ చంద్రబోస్ కుటుంబ సభ్యులపై గూఢచార శాఖ నిఘా కొనసాగాలని నెహ్రూ ఆదేశించారన్న వాదనను ఆయన కూతురు అనితా బోస్ ఫాఫ్ కూడా అంగీకరించలేదు. 2005లో శ్యాం బెనెగల్ బోస్ పై ఒక సినిమా తీశారు. నేతాజీ అదృశ్యం, ఆయన మృతి వివాదాస్పదమైనట్టే ఈ సినిమా కూడా వివాదం రేకిత్తించింది. మరీ విచిత్రం ఏమిటంటే నేతాజీ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వారే ఈ సినిమాను వ్యతిరేకించారు. అసలు బోస్ కు పెళ్లే కాలేదని, […]

Advertisement
Update:2015-04-26 02:30 IST

స్వాతంత్ర్యానంతరం నేతాజీ సుభాశ్ చంద్రబోస్ కుటుంబ సభ్యులపై గూఢచార శాఖ నిఘా కొనసాగాలని నెహ్రూ ఆదేశించారన్న వాదనను ఆయన కూతురు అనితా బోస్ ఫాఫ్ కూడా అంగీకరించలేదు. 2005లో శ్యాం బెనెగల్ బోస్ పై ఒక సినిమా తీశారు. నేతాజీ అదృశ్యం, ఆయన మృతి వివాదాస్పదమైనట్టే ఈ సినిమా కూడా వివాదం రేకిత్తించింది. మరీ విచిత్రం ఏమిటంటే నేతాజీ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వారే ఈ సినిమాను వ్యతిరేకించారు. అసలు బోస్ కు పెళ్లే కాలేదని, ఆయనకు పిల్లలు లేరని ఆ పార్టీ వాదించింది.

1934లో చికిత్స కోసం బోస్ వియన్నా వెళ్లారు. చికిత్స చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లేటట్టయితేనే విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించడంతో బోస్ వియన్నా వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో వియన్నా మంచి వైద్య సదుపాయాలకు ప్రసిద్ధి. అక్కడ ఆయన ఒక పుస్తకం రాయాలనుకున్నారు. తన రాత ప్రతి టైప్ చేసి పెట్టడానికి ఒక సెక్రెటరీ కావాలనుకున్నారు. దానికోసం ఒక భారతీయ విద్యార్థి సహాయం తీసుకున్నారు. ఆ విద్యార్థి ఇంగ్లీషు బోధించే వాడు. అక్కడే ఎమిలీ షెంకెల్ ను బోస్ కు పరిచయం చేశారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది. 1942లో ఒక కూతురు పుట్టింది. ఆమే అనితా బోస్ ఫాఫ్. అనితా బోస్ ఫాఫ్ కు నాలుగు నెలలున్నప్పుడు చూడడమే బోస్ తన కూతురిని ఆఖరి సారి చూడడం.

అనితా బోస్ 1960 తర్వాత పది పదిహేను సార్లు భారత్ వచ్చింది. మొట్టమొదటి సారి అనితా బోస్ భారత్ వచ్చినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ ఆమెను తన ఇంటికి ఆహ్వానించారు. ఆమె నెహ్రూ ఇంట్లో వారం రోజులు ఉన్నారు. నెహ్రూ, తన తండ్రి నేతాజీ రాజకీయ అభిప్రాయాల మధ్య సామ్యం ఉండేదనీ ఇద్దరూ కాంగ్రెస్ లో వామ పక్ష రాజకీయాలకు సంకేతమని అనితా బోస్ అంటారు. సుభాశ్ బోస్ యువజన బ్రిగేడ్లను ఏర్పాటు చేశారు. వాటికి గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్ అన్న పేర్లే పెట్టారు. గాంధీ మీద బోస్ కు ఆగ్రహమేమీ లేదు. తాను మాట్లాడే మాటలకు, చేసే పనులకు గాంధీ ఎలా స్పందిస్తారోనని బోస్ ఎదురు చూసే వారు. అయితే బోస్ కు ఉన్న సోషలిస్టు భావాలు గాంధీకి నచ్చేవి కాదు. 1938లో బోస్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1939లో రెండో సారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదీ గాంధీ ప్రతిపాదించిన పట్టాభి సీతారామయ్యను ఓడించి బొస్ రెండో సారి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. అది గాంధీకి ఏ మాత్రం నచ్చలేదు. చివరకు బోస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో బోస్ తరఫున మాట్లాడింది నెహ్రూయే. బోస్ కాంగ్రెస్ ను వీడి వెళ్లకూడదని భావించే వారు. అయితే నెహ్రూ చేయవలసినంత చేయలేదన్న భావన బోస్ కు ఉండేది. ఎవరైతే గాంధీని “జాతి పిత” అని సంబోధించారో ఆ వ్యక్తే కాంగ్రెస్ ను వీడడానికి కారకుడయ్యారు గాంధీ.

“జై హింద్” అన్న నినాదం నిజానికి బోస్ నడిపిన ఆజాద్ హింద్ ఫౌజ్ వాడిన మాట. ఈ మాటను మాత్రం మనం ఇప్పటికీ వాడుతున్నాం. జాతీయ గీతాన్ని ఎంపిక చేసి ప్రచారంలో పెట్టింది కూడా నేతాజీయే. దాన్ని మొట్టమొదటి సారి హాంబర్గ్ లో ఆలపించారు.

నెహ్రూకు బోస్ కు మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాని విభేదాలు లేవు. “నెహ్రూ ఆలోచనా ధోరణిలో సోషలిజం ఉన్నా ఆయన ఆత్మకు గాంధీ ఇంపైన వారు” అని బోస్ వ్యాఖ్యానించారు. 1939 నుంచి బోస్ బ్రిటిష్ వారిని పారదోలడానికి ఆయుధాలు పట్టడం తప్పు కాదని వాదించేవారు. అదీ నెహ్రూకు అంత అభ్యంతరకరమైన వాదన కాలేదు కాని రెండో ప్రపంచ యుద్ధం అంతం అవుతున్న దశలో అగ్ర రాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ వంటి ఫాసిస్టు దేశాల సహకారం తీసుకోవాలని బోస్ ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన హిట్లర్, ముస్సోలినీని కూడా కలుసుకున్నారు. నెహ్రూ మొదటి నుంచీ ఫాసిస్టు వ్యతిరేక వైఖరినే అనుసరించారు. సహజంగానే బోస్ ఫాసిస్టుల సహకారం కోసం ఆరాటపడడం నెహ్రూకు నచ్చి ఉండదు. అంత మాత్రం చేత బోస్ ను నెహ్రూ ద్వేషించాడని కాదు. బోస్ విమాన ప్రమాదంలో మరణించారన్న వార్త తెలిసినప్పుడు నెహ్రూ కంట తడి పెట్టుకున్నారు. జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు బోస్ అవశేషాలు ఉన్న రెంకోజీ దేవాలయానికి వెళ్లారు.

బ్రిటిష్ వారు బోస్ ప్రయాణిస్తున్న విమానాన్ని పేల్చేసి ఉంటారన్న వాదనను కూడా అనితా బోస్ ఫాఫ్ ఖండించారు. జపాన్ దాదాపు లొంగి పోయే స్థితికొచ్చినప్పుడు అమెరికా సేనలు తైవాన్ లో ప్రవేశించాయనీ ఒక వేళ విద్రోహమేదైనా జరిగి ఉంటే అది అమెరికా వల్లే జరిగి ఉండొచ్చునని అనితా బోస్ భావించారు.

స్వాతంత్ర్యం తర్వాత వామపక్ష నాయకుల మీద నిఘా కొనసాగింది. నేతాజీ ఆన్న కుమారుడు అమియా బోస్ 1960లలో బెంగాల్ లో వామపక్ష రాజకీయాలలో ప్రసిద్ధుడు. ఆ కారణంగా కూడా బోస్ కుటుంబంపై నిఘా కొనసాగి ఉండొచ్చు. అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి బీ సీ రాయ్ అయినా బోస్ కుటుంబంపై నిఘాకు ఆదేశించి ఉండొచ్చునని జే ఎన్ యూ లో చరిత్ర అధ్యాపకురాలు మృదులా ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లు అన్నీ బయటపడితే తప్ప అసలు విషయం తేలదు. అంతవరకు నెహ్రూ మీద కసి వెళ్లగక్కే వారిని ఆపడమూ కుదరదు.

– ఆర్వీ రామారావ్

Also Read నేతాజీ అదృశ్యంపై చిక్కు విప్పాల్సిందే

Tags:    
Advertisement

Similar News