కదిలారు....కదిలించారు!ఈ సహనం...మహిళలకు మాత్రమే సొంతం!
వంట, ఇంటిపనులతో తలమునకలయ్యే ఏడుగురు సాధారణ మహిళలు సామాజిక దృక్పథంతో అసాధారణంగా స్పందించారు. ఈ రోజుల్లో మనుషులు ఏ పనైనా డబ్బుకోసమే చేస్తారనే నమ్మకం సర్వత్రా వ్యాపించి ఉండగా, ఈ మధురై మహిళలు మాత్రం తమకేమీ కాని అనాథల కోసం కమ్మని వంటచేసి పెడుతూ, ప్రతిఫలంగా అంతులేని తృప్తిని పొందుతున్నామని చెబుతున్నారు. సరిగ్గా నాలుగునెలల క్రితం మొదలైంది వీరి సేవా ప్రస్థానం. దీప, విజయ, అముత, మురుగేశ్వరి, శాంతి, మహేశ్వరి, సుబ్బులక్ష్మి ఈ ఏడుగురూ కలిసి ఒక […]
వంట, ఇంటిపనులతో తలమునకలయ్యే ఏడుగురు సాధారణ మహిళలు సామాజిక దృక్పథంతో అసాధారణంగా స్పందించారు. ఈ రోజుల్లో మనుషులు ఏ పనైనా డబ్బుకోసమే చేస్తారనే నమ్మకం సర్వత్రా వ్యాపించి ఉండగా, ఈ మధురై మహిళలు మాత్రం తమకేమీ కాని అనాథల కోసం కమ్మని వంటచేసి పెడుతూ, ప్రతిఫలంగా అంతులేని తృప్తిని పొందుతున్నామని చెబుతున్నారు. సరిగ్గా నాలుగునెలల క్రితం మొదలైంది వీరి సేవా ప్రస్థానం. దీప, విజయ, అముత, మురుగేశ్వరి, శాంతి, మహేశ్వరి, సుబ్బులక్ష్మి ఈ ఏడుగురూ కలిసి ఒక సాయంత్రం వేళ రోజూలాగే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఎల్. అముతన్ అనే సామాజిక కార్యకర్త వారిని ఈ సహాయం గురించి అడిగారు. తమ కంటూ ఎవరూ లేని అనాథ పిల్లలు, వృద్ధులకోసం వంటచేసి పెట్టగలరా, అని. ఒక్కసారిగా వారి మనసులు కరిగాయి. ఇంకేమీ ఆలోచించకుండా ముందుకు కదిలారు. చుట్టుపక్కల ఇళ్లనుండి వంటచేయడానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకోగలిగారు. బియ్యం, కందిపప్పు లాంటివే కాకుండా డబ్బు సైతం వారికి విరాళాలుగా అందటం మొదలైంది.
మొదటి ప్రయత్నం లోనే పదికిలోల బియ్యం, రెండున్నర కిలోల కందిపప్పు, 25 కిలోల కూరగాయలతో పాటు పాలు నూనె తదితరాలు పోగుచేయగలిగారు. వీటితో విలాంగుడిలో ఉన్న 50మంది అనాథాశ్రమ పిల్లలకు మంచి భోజనం అందించగలిగారు. వండటమే కాదు, మూడుచక్రాల బండిపై వంటలను తీసుకెళ్లి వారే వడ్డించి వచ్చారు.
తమ ఇంటిపనులు చేసుకుని ఇతరులకు కొంత సమయాన్ని కేటాయించగలమన్న సంగతి అప్పటివరకు తమకే తెలియదంటున్నారు ఈ మహిళలు. వీరు బృందంగా ఏర్పడిన వెంటనే భారతి చెల్లమ్మ గ్రూపు అనే పేరుతో సంఘంగా మారారు.
మనుషులను ఒక్కటి చేయటంలో ఆహారం అన్నింటికంటే ముందుంటుందని ఈ మహిళలు చెబుతున్నారు. టివి సీరియల్స్, కబుర్లకంటే ఇది తమకెంతో ఆనందాన్ని స్తోందంటున్నారు. భోజనం చేసిన పిల్లలు చప్పట్లతో తమని అభినందిస్తుంటే ఎంతో భావోద్వేగాలకు గురవుతున్నామంటున్నారు ఈ సేవాబృందం. ఇంతకుముందు నెలకు ఒకసారి చేయగలిగినా చాలనుకున్నారు. ఇప్పుడు వారానికి ఒకసారి ఈ తల్లులు అనాథబిడ్డల, వృద్ధుల కడుపులు నింపుతున్నారు. చాలామంది పుట్టినరోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి దానాలు చేస్తుంటారు. కానీ పిల్లలు తినే సమయంలో వారు ఉండరని, తాము మాత్రం వారు భోజనం చేస్తున్నపుడు, వారు పొందుతున్న ఆనందాన్ని కళ్లారా చూస్తున్నామని, తమ మధ్య ఒక అనుబంధం ఏర్పడిందని వీరు చెబుతున్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లోని అనాథపిల్లలకు వీరు దేవుడిచ్చిన తల్లులు. ఇలాంటి సందర్భాల్లో స్త్రీ పురుష సమానత్వం అనేమాటని మనం పక్కనపెట్టాలి. ఎందుకంటే సహన గుణంలో మహిళలు ఎన్నటికీ మగవారికంటే అధికులే.