రైతుకు భరోసా ఇద్దాం: విపక్షాలకు మోడీ పిలుపు
రైతులు కష్టాల్లో ఉన్నారన్నది నిజమని, అయితే వీటికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. గురువారం పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగిన సందర్భంగా ప్రధాని ప్రకటన చేస్తూ ఢిల్లీలో ఆమ్ఆద్మీ ర్యాలీ సందర్భంగా రైతు ఆత్మహత్యకు పాల్పడడం దురదృష్టకరమని, ప్రాణం కంటే ప్రపంచంలో గొప్పది ఏదీ లేదని ఆయన అన్నారు. రైతుల కష్టాలను గట్టెక్కించడానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇందుకు విపక్షాలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆత్మహత్యలను రాజకీయం […]
Advertisement
రైతులు కష్టాల్లో ఉన్నారన్నది నిజమని, అయితే వీటికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. గురువారం పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగిన సందర్భంగా ప్రధాని ప్రకటన చేస్తూ ఢిల్లీలో ఆమ్ఆద్మీ ర్యాలీ సందర్భంగా రైతు ఆత్మహత్యకు పాల్పడడం దురదృష్టకరమని, ప్రాణం కంటే ప్రపంచంలో గొప్పది ఏదీ లేదని ఆయన అన్నారు. రైతుల కష్టాలను గట్టెక్కించడానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇందుకు విపక్షాలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆత్మహత్యలను రాజకీయం చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదని ప్రధాని అన్నారు.
అంతకుముందు చర్చ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సభకు రాకుండా ట్వీట్‌లతో కాలక్షేపం చేయడం తగదని కాంగ్రెస్ పేర్కొంది. మోడీ విధానాలే రైతులు ఈ దుస్థితిలో ఉండడానికి కారణమని విమర్శించారు. ఆత్మహత్యల నియంత్రణకు అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని బీఎస్‌పీ నాయకురాలు మాయావతి ప్రశ్నించారు. దీనికి గడ్కారీ స్పందిస్తూ అసలు రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ గతంలో అనుసరించిన విధానాలే కారణమని అన్నారు. ఆప్ ర్యాలీలో రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదని ఎంపీ మల్లిఖార్జన ఖర్గే ప్రశ్నించారు. అసలు ఆ రైతుకు ఎవరు ఎంత పరిహారం ఇస్తారో చెప్పాలని ఆప్‌ను, బీజేపీని ఆయన నిలదీశారు. సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉండి కూడా ఏంచేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటన చేస్తూ పోలీసులు చెబుతున్నా రైతు ఆత్మహత్యా ప్రయత్నం మానలేదని, ఆయన్ని బతికించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆప్ కార్యకర్తల వ్యవహారశైలి వల్ల సకాలంలో వైద్యం అందించలేక పోయామని రాజ్‌నాథ్ చెప్పారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు.
ఇదే విషయమై ఉదయం చర్చకు విపక్షాలు పట్టుబట్టినప్పుడు లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై చర్చను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. సభలు ప్రారంభమైన వెంటనే దీనిపై కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చాయి. వీటిని స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. ఆప్ ర్యాలీలో రాజస్థాన్‌కు చెందిన రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్యపై చర్చకు కూడా కాంగ్రెస్ పట్టుబట్టింది దీనిపై చాలా సేపు గందరగోళం జరిగింది. తాము చర్చకు సిద్ధమేనని అయితే దీనికి ఓ పద్ధతి ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అసలు ఆత్మహత్యలపైనే కాకుండా రైతుల మొత్తం సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు స్పీకర్ పొడియం వద్దకు పోయి చర్చకు డిమాండు చేస్తూ ధర్నాకు దిగారు. అయినా స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల నుంచి ప్రశ్నలు స్వీకరించడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసి వెళ్ళిపోయారు.
Advertisement