అమరావతి అధికారులకు జీతాల్లేవు, సెలవులూ లేవు

రాజధాని భూసమీకరణ బాధ్యతలను నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్లు నెలల తరబడి నానా హైరానా పడుతున్నారు. బండెడు చాకిరీ చేస్తున్నా జీతాల్లేక పడరాని పాట్లు పడుతున్నారు. అటు జీతాల్లేక, ఇటు సెలవులు సైతం లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. భూ సమీకరణ కోసం గతేడాది డిసెంబర్ లో రాష్ట్రంలో పలుచోట్ల పనిచేస్తున్న 34 మంది డిప్యూటీ కలెక్టర్లు, 60 మంది తహసీల్దార్లు, 35 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 180 మంది సర్వేయర్లు, 40 మంది కంప్యూటర్ ఆపరేటర్లను గుంటూరు […]

Advertisement
Update:2015-04-13 11:19 IST

రాజధాని భూసమీకరణ బాధ్యతలను నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్లు నెలల తరబడి నానా హైరానా పడుతున్నారు. బండెడు చాకిరీ చేస్తున్నా జీతాల్లేక పడరాని పాట్లు పడుతున్నారు. అటు జీతాల్లేక, ఇటు సెలవులు సైతం లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. భూ సమీకరణ కోసం గతేడాది డిసెంబర్ లో రాష్ట్రంలో పలుచోట్ల పనిచేస్తున్న 34 మంది డిప్యూటీ కలెక్టర్లు, 60 మంది తహసీల్దార్లు, 35 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 180 మంది సర్వేయర్లు, 40 మంది కంప్యూటర్ ఆపరేటర్లను గుంటూరు జిల్లాలో ఉన్నతాధికారులు నియమించారు. సమీకరణ జరుగుతున్న 29 గ్రామాలకు ఒక్కో డిప్యూటీ కలెక్టర్ ను అధికారిగా, ఇద్దరు తహసీల్దార్లు, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఆరుగురు సర్వేయర్లు, ఒకరిద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. అయితే డిప్యూటీ కలెక్టర్లలో పలుకుబడి ఉన్న కొందరిని ఈ బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం పదవీ విరమణకు చేరువలో ఉన్నవారిని, పలుకుబడి లేని వారిని ఇక్కడికి పంపింది.

ప్రస్తుతం 30 మంది డిప్యూటీ కలెక్టర్లు తమకిచ్చిన సిబ్బందితో గ్రామాల్లో పనిచేస్తున్నారు. నిధులు లేకుండానే గ్రామాల్లో సీఆర్డీఏ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం, వసతులు సమకూర్చుకోవడం సహా అంతా వారే చేసుకోవాల్సి వచ్చింది. ఒక్క రూపాయి కూడా సీఆర్డీఏ వారికి ఇవ్వకపోవడంతో మిగిలిన అధికారులు, సిబ్బందికి అవసరమైన ఖర్చులను సైతం డిప్యూటీ కలెక్టర్లే చూసుకోక తప్పడంలేదు. కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు మినహా నాలుగు నెలల నుంచి మిగిలిన వారికి జీతాలివ్వలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారికి కనీసం సెలవులు కూడా ఇవ్వడంలేదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భూ సమీకరణ పని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ తుళ్లూరులో సమీక్షా సమావేశం ఇలా.. నాలుగు నెలలుగా యంత్రాల్లా ఇదే పనిచేస్తున్నారు. తాజాగా కౌలు చెక్కుల పంపిణీ బాధ్యతను కూడా డిప్యూటీ కలెక్టర్లపైనే భారం వేశారు. మొదట్లో గుంటూరు చెక్కులపై తమ సంతకాలుంటే భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో వారు ఈ పని నుంచి తప్పించుకున్నారనే వాదన వినిపిస్తోంది.

కాగా, గ్రామాల్లో సీఆర్డీఏ కాంపిటెంట్ అథారిటీ డిప్యూటీ కలెక్టర్లే అయినందువల్ల వారి ఖాతాలో డబ్బులు వేసి వారితోనే చెక్కులను రైతులకు పంపిణీ చేయిస్తున్నారు. దీంతో రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలు, నోటీసులన్నింటికీ వారే సమాధానం చెప్పాల్సి వస్తోంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులు ప్రతిరోజూ భూ సమీకరణ టార్గెట్లపై సమీక్షిస్తూ డిప్యూటీ కలెక్టర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. పనంతా డిప్యూటీ కలెక్టర్లతో చేయిస్తూనే తామే చేసినట్లు సీఆర్డీఏ ఉన్నతాధికారులు, గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమను వెంటనే రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు డిప్యూటీ కలెక్టర్లు యోచిస్తున్నారు. తమ పరిస్థితిని నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. లేనిపక్షంలో మూకుమ్మడి సెలవులు పెట్టి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే, సీఆర్డీఏ సిబ్బందికి సైతం జీతాలు అంతంత మాత్రంగానే ఇస్తున్నారనేది తెలుస్తోంది. గతంలో జీతాల్లేక సీఆర్డీఏ సిబ్బంది సైతం ఈ తరహా ఇబ్బందులనే ఎదుర్కొవాల్సి వచ్చింది. సిబ్బందికి చాలిచాలనీ జీతాలు అందిస్తున్నారనేది బహిరంగంగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News