సోనియా, రాహుల్ తో షర్మిల భేటీ.. విలీనం ఎప్పుడంటే..?
షర్మిల పోటీ చేసే స్థానం, అక్కడ ఓడిపోతే ప్రత్యామ్నాయం, ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో గెలిచి అధికారంలోకి వస్తే షర్మిలకు ఇచ్చే ప్రాధాన్యం.. ఈ మూడు విషయాలపై స్పష్టత కోసం చర్చలు జరిగాయి.
ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు వైఎస్ షర్మిల. సోనియా నివాసం నుంచి బయటకొచ్చిన ఆమె మీడియాతో పొడిపొడిగా మాట్లాడారు. వెంట షర్మిల భర్త అనిల్ కూడా ఉన్నారు. పార్టీ విలీనం ఎప్పుడు అనే అసలు ప్రశ్నకు మాత్రం షర్మిల సమాధానం దాటవేశారు. అయితే సోనియా, షర్మిల భేటీతో కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం అనేది ఖాయమైపోయింది. ముహూర్తం మాత్రం త్వరలో తేలిపోతుంది.
కొంతకాలంగా షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో కలిపేస్తారనే ప్రచారం జరుగుతోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ వ్యవహారం ఊపందుకుంది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ డీల్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఒంటరిపోరు దాదాపుగా అసాధ్యం అని తేలిపోయే సరికి కాంగ్రెస్ తో చేరి హడావిడి చేద్దామనుకుంటున్నారు షర్మిల.
వైఎస్ఆర్ మరణం తర్వాత పరామర్శల విషయంలో తమని అవమానించారంటూ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేశారు జగన్. అనేక ఎదురుదెబ్బల తర్వాత సీఎం పీఠం చేజిక్కించుకున్నారు. అన్నతో పాటే వైఎస్సార్సీపీకోసం పనిచేసిన షర్మిల వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ ఏర్పాటు చేసి సొంత ప్రయత్నం చేశారు. కానీ ఏపీలో ఉన్న పరిస్థితులు తెలంగాణలో లేవు. బీఆర్ఎస్ బలంగా ఉంది, ఆ పార్టీకి పడని ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ కి వెళ్తున్నాయి. ఈ దశలో వైఎస్సార్టీపీ తెలంగాణలో అద్భుతాలు చేయడం అసాధ్యం. అందుకే ఆమె కాంగ్రెస్ తో డీల్ సెట్ చేసుకున్నారు.
ఎప్పుడు..? ఎలా..?
కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ఖాయమైపోయింది. అయితే ఎప్పుడు, ఎలా అనేది తేలాల్సి ఉంది. ప్రత్యేకంగా వైఎస్సార్టీపీలో పేరున్న నాయకులు, బలమైన స్థానిక నేతలు లేరు కాబట్టి.. షర్మిలకు పెద్దగా డిమాండ్లేవీ ఉండకపోవచ్చు. షర్మిల పోటీ చేసే స్థానం, అక్కడ ఓడిపోతే ప్రత్యామ్నాయం, ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో గెలిచి అధికారంలోకి వస్తే షర్మిలకు ఇచ్చే ప్రాధాన్యం.. ఈ మూడు విషయాలపై స్పష్టత కోసం చర్చలు జరుగుతున్నాయి. షర్మిలను ఇప్పటికిప్పుడు ఏపీకి పంపిస్తారనే వార్తలు కూడా సరికావని అనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల పార్టీ విలీనం జోరందుకుంది కాబట్టి.. ఆమెను తెలంగాణకే పరిమితం చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత షర్మిల అవసరాన్ని బట్టి ఏపీలో కూడా ఆమె సేవలు వినియోగించుకుంటారని తెలుస్తోంది.
♦