కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు? అధిష్టానం దృష్టిలో ఉన్నదెవరు?

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలనే వ్యూహాల కంటే.. గెలిస్తే తమకు సీఎం పోస్టు ఎలా దక్కుతుందనే ఆలోచనలే కీలక నేతలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Update:2023-09-10 08:59 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సాధిస్తే.. సీఎం ఎవరు అవుతారనే అనుమానమే ఉండదు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని పార్టీ అంతా ముక్తకంఠంతో చెబుతోంది. ఈ విషయంలో అగ్రనాయకుల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఎవరికీ డౌట్ ఉండదు. మరి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి ఎవరు? తెలంగాణ ఎన్నికల్లో ఎవరి నాయకత్వాన్ని చూపించి ఓట్లు అడుగుతారు? అంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి క్లారిటీ లేదు. కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్థులే అనే వ్యంగ్యాన్ని నిజం చేసేలా.. టాప్ పోస్టు కోసం ఎంతో మంది ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలనే వ్యూహాల కంటే.. గెలిస్తే తమకు సీఎం పోస్టు ఎలా దక్కుతుందనే ఆలోచనలే కీలక నేతలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా అధికారంపై ఆశలు పెరిగాయి. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు చేరుతుండటం, అధిష్టానం కూడా రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో ఈ సారి తప్పకుండా అధికారంలోకి వస్తామనే ఆశతో ఉన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బలమైన బీఆర్ఎస్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు పేచీ అంతా సీఎం పదవి దగ్గరే వస్తోందని తెలుస్తున్నది.

కర్ణాటకలో ఎన్నికలకు వెళ్లే ముందే సిద్దిరామయ్య, డీకే శివకుమార్‌లను జంట నాయకులుగా ప్రకటించింది. టికెట్ల కేటాయింపు, ప్రచార బాధ్యతలు, ఆర్థిక సహాయం వంటి విషయాలన్నీ ఈ ఇద్దరు నాయకులే చూసుకున్నారు. ఒకప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నా.. ఎన్నికల సమయంలో మాత్రం కలిసి పని చేశారు. ఇక ఎన్నికల అనంతరం సీఎం పోస్టుపై డీకే శివకుమార్ ఆశలు పెట్టుకున్నా.. సీనియర్ అయిన సిద్దిరామయ్య వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందా? అంటే లేదనే అనుకోవచ్చు.

టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉన్నా.. ఆయనకు హైకమాండ్ ఫ్రీహ్యాండ్ ఇవ్వలేదు. పలువురు సీనియర్లు రేవంత్‌ను వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ప్రస్తుతం అనధికారికంగా డీకే శివకుమార్ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా.. అధిష్టానం పూర్తిగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇక సీనియర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలకపాన్పుపై ఉన్నారు. తనకు ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వలేదని అలకబూనారు. మరోవైపు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం పెద్ద పీట వేస్తోంది. స్క్రీనింగ్ కమిటీతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా చోటు కల్పించింది. పైగా ఉత్తమ్‌తో పాటు భార్య పద్మావతికి కూడా టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నది.

కర్ణాటక మాదిరిగా రేవంత్‌తో పాటు మరో నాయకుడిని తెరపైకి తేవాలని అధిష్టానం భావించినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహా తదితరులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ను పక్కన పెట్టి వేరే వాళ్లను ఎన్నికల్లో ముందు నిలబట్టే అవకాశం లేదు. దీంతో అధిష్టానం తెలంగాణ విషయంలో తీవ్రంగా కసర్తతు చేయాల్సి వస్తున్నది.

రేవంత్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దీంతో బీసీ లేదా ఎస్సీ నాయకుడిని అతడికి తోడుగా మెయిన్ క్యాంపెయినర్‌గా ప్రకటించాలని చాలా మంది కోరుతున్నారు. బయటకు వెల్లడించకపోయినా సీనియర్లు అందరినీ పిలిచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు.. ఇతర పదవుల విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. అలా చేయడం వల్ల ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉంటుందని తెలంగాణ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రాజకీయం వేరుగా ఉన్నది. ఇక్కడ ఏ ఒక్కరిని అయినా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. మిగిలిన నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారనే అనుమానాలు అధిష్టానానికి ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ సహా ఎవరిని కూడా సీఎం పోస్టుకు ప్రకటించకూడదని.. అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందే అని అధిష్టానం సూచిస్తోంది. ముందుగా 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉండటంతో ఇప్పుడు సీఎం అభ్యర్థిపై ప్రకటన చేయడం సరి కాదని భావిస్తోంది.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రమే సీఎం పదవిపై మాట్లాడాలని.. అప్పటి వరకు ఎవరూ దీనిపై చర్చ చేయవద్దని సూచించినట్లు సమాచారం. హైదరాబాద్ వేదికగా జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో తెలంగాణలో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించనున్నారు. అక్కడ తీసుకునే నిర్ణయాలను ప్రతీ నాయకుడు పాటించాలని.. రాష్ట్రంలో గెలుపు పైనే ముందు దృష్టి పెట్టాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులకు చెప్పినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News