బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాల వెనుక ఉన్నదెవరు? సీఎం కేసీఆర్ నమ్ముతున్నదెవరిని?

బీఆర్ఎస్ విషయంలో కేవలం తన సొంత నిర్ణయాలనే కాకుండా.. ఇతరుల సూచనలు స్వీకరిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.

Advertisement
Update:2023-01-30 07:44 IST

సీఎం కేసీఆర్ రాజకీయంగా ఏ నిర్ణయం ప్రకటించినా.. హఠాత్తుగా తీసుకున్నట్లు అనిపిపిస్తుంది. ప్రతిపక్షాలు, ప్రజలు ఆయన నిర్ణయాలు ఎందుకు ఇంత త్వరగా తీసుకుంటున్నారని భావిస్తుంటారు. కానీ, కేసీఆర్ ఏ నిర్ణయం కూడా హఠాత్తుగా తీసుకోరు. ఒక విధాన నిర్ణయం ప్రకటించాలన్నా.. రాజకీయంగా ఒకడుగు ముందుకు వేయాలన్నా ఎంతో ఆచితూచి వేస్తుంటారు. పార్టీ సీనియర్ల సలహాలను మాత్రమే కాకుండా ఇతర మేధావుల సూచనలు కూడా తీసుకుంటుంటారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటన, ఇతర రాష్ట్రాల్లో విస్తరణ విషయంలో కూడా సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి ముందుకు వెళ్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో దేశంలో బీఆర్ఎస్ ఒక బలమైన జాతీయ పార్టీగా రూపొందాలనే లక్ష్యంతోనే ఆయన అడుగులు పడుతున్నాయి.

ఇప్పటికే దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా అడుగు పెట్టేందుకు విస్తరణ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నారు. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో బీఆర్ఎస్ పుట్టింది. అందుకే ముందుగా పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలు రాష్ట్రాలకు చెందిన మాజీ సీఎంలు, మంత్రులను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి వారికి గులాబీ కండువాలు కప్పారు. ఆయా రాష్ట్రాల్లో కొంత మంది ప్రభావం పెద్దగా ఉండదని తెలిసినా.. కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించడానికి కారణం ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే, ముందుగా ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు ప్రాతినిథ్యం ఉండాలనే లక్ష్యంతోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి అనుసరించవలసిన వ్యూహాలను ప్రగతిభవన్ నుంచే అమలు చేస్తున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంలో మాజీ ఐఏఎస్, సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ జడ్జీలు, ఇతర రాష్ట్రాల సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు ఇస్తున్న సలహాల మేరకే విస్తరణ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ విషయంలో కేవలం తన సొంత నిర్ణయాలనే కాకుండా.. ఇతరుల సూచనలు స్వీకరిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రతీ పక్షం రోజులకు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే వ్యూహం కూడా అలా ముందుకు వచ్చిందేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు ఇలా ఇతరుల సలహాలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, కేసీఆర్ అమలు చేస్తున్న విధానం సరైనదేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను అక్కడి వారే వివరించడం వల్ల మరింత అవగాహన వస్తుందని, దాని ప్రకారం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై ఒక స్పష్టత ఏర్పడుతుందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ ఎవరి మాట వినరు అనే దానికి భిన్నంగా.. ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ.. సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీని పటిష్టంగా విస్తరించే పనిలో ఉన్నారు. 

Tags:    
Advertisement

Similar News