కాంగ్రెస్ కు కాదు బీజేపీకి ఓటేయండి... కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపీ వెంకట్ రెడ్డి ఫోన్లు ...లీక్

కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి తమ పార్టీకి కాకుండా బీజేపీకి ఓటేయమంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్తకు చేసిన ఫోన్ ఆడియో లీక్ అయ్యింది. ఇప్పుడది సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది.

Advertisement
Update:2022-10-21 15:15 IST

కోమటి రెడ్డి బ్రదర్శ్ ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ స్వంత పార్టీలకు హ్యాండిచ్చి మరీ ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరి మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి తన పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి కాక బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి తన తమ్ముడికి ఓటు వేయాలి, వేయించాలని చెప్పారన్న విషయం స్వయంగా ఆ కార్యకర్తలే బైటపెట్టారు. కొన్ని చోట్ల వెంకటరెడ్డి పద్దతులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శనలు కూడా చేశారు. ఇప్పుడిక ఓ కాంగ్రెస్ కార్యకర్తతో వెంకట రెడ్డి మాట్లాడిన మాటల ఆడీయో లీక్ అయి కలకలం సృష్టిస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలోని ఓ కాంగ్రెస్ కార్యకర్తకు కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ కోరాడు. ''పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా. చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి. ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకొస్తా.. అప్పుడు మిమ్మల్నందిరినీ నేను చూసుకుంటా'' అని ఫోన్లో కాంగ్రెస్ కార్యకర్తకు వెంకటరెడ్డి చెప్పాడు. ఈ ఆడియో లీక్ అయ్యి ఇప్పుడు వాట్స‌ప్, ఫేస్ బుక్ లలో విపరీతంగా ప్రచారం అయ్యింది.

అయితే ఈ ఆడియో మీద మాట్లాడటానికి వెంకటరెడ్డి అందుబాటులో లేడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల హాలిడే ట్రిప్ కోసం ఆయన‌ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.

ఇక కాంగ్రెస్ నాయకులు ఈ ఆడియో పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Full View

Tags:    
Advertisement

Similar News