ఠాక్రేజీ.. ఈ సీఎం గోల కాస్త ఆగేలా చూడండి..

వీహెచ్ చురకలతో అయినా.. ఎన్నికలయ్యే వరకు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సీఎం అభ్యర్థులు పుట్టుకు రాకుండా ఉంటారేమో చూడాలి.

Advertisement
Update:2023-11-10 19:57 IST

తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో కొత్త సీఎం అభ్యర్థి పుట్టుకొస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు ఈ వ్యవహారం కామెడీగా మారిపోయింది. కాంగ్రెస్ ని విమర్శించే క్రమంలో ఆ పార్టీలో సీఎం అభ్యర్థుల గురించి కూడా చెణుకులు విసురుతున్నారు వైరి వర్గం నేతలు. సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ సీఎం గోలపై స్పందించారు. ఠాక్రే సమక్షంలోనే పంచాయితీ పెట్టారు. సీఎం గోల ఆపమని చెప్పాలంటూ ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేకి సూచించారు.

కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి నామినేషన్‌ అనంతరం బీసీ డిక్లరేషన్ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న వీహెచ్.. సీఎం అభ్యర్థుల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. "కాంగ్రెస్‌లో ఎవరికి వారు నేనే సీఎం అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు నేనే సీఎం అనడం మానేయాలి. ఠాక్రేజీ..! నేతలందరికీ ఈ సీఎం గోల ఆపమని చెప్పండి. కాంగ్రెస్‌లో సీఎంను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. నాకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చిపోయింది. ముందు ఎన్నికల్లో గెలవండి.. తర్వాత సీఎం పంచాయితీ." అని చెప్పారు వీహెచ్.

ఆ ముచ్చట తీర్చుకున్నారుగా..

అయితే వీహెచ్ చెప్పిన సూచనలో చివరిగా ఆయన చెప్పిన మాటే హైలైట్ అవుతోంది. గతంలో తనకు కూడా ఆ అవకాశం వచ్చిపోయిందని ఆయన అన్నారు. అంటే సీఎం రేసులో తానుకూడా ఉన్నానని పరోక్షంగా వీహెచ్ ప్రస్తావించారనే అనుకోవాలి. బీజేపీ బీసీ సీఎం అంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల్లో సీనియర్ గా తనకు ఆ అవకాశం ఎందుకు రాకూడదు అనుకున్నారో ఏమో.. గతంలో తనకు సీఎం సీటు అవకాశం వచ్చి పోయిందని చెప్పుకొచ్చారు వీహెచ్. మొత్తమ్మీద వీహెచ్ చురకలతో అయినా.. ఎన్నికలయ్యే వరకు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సీఎం అభ్యర్థులు పుట్టుకు రాకుండా ఉంటారేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News