హైదరాబాద్ లో పెట్టుబడులకు అమెరికా కంపెనీల ఆసక్తి..
హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అమెరికా కాన్సులేట్.. దక్షిణాసియాలోనే అతిపెద్దది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి వీసా సౌకర్యాల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది.
హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్. అమెరికా, భారత్ మధ్య పటిష్ట వాణిజ్య బంధానికి హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారాయన. హైదరాబాద్ నానక్ రాం గూడలో నూతనంగా నిర్మించిన యూఎస్ కాన్సులేట్ భవనంలో ఈనెల 20 నుంచి కార్యకలాపాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. యూఎస్ కాన్సులేట్ కార్యకలాపాల వివరాలను వేదాంత్ పటేల్ వివరించారు. భారత్ లో అమెరికా పెట్టుబడులే కాకుండా భారత్ నుంచి అమెరికాలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కూడా కాన్సులేట్ ఉపయోగపడుతుందన్నారు.
రూ.2,800 కోట్ల భారీ వ్యయంతో
హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అమెరికా కాన్సులేట్.. దక్షిణాసియాలోనే అతిపెద్దది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి వీసా సౌకర్యాల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ లో అమెరికాకు ఉన్న వాణిజ్య అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విశాలమైన కాన్సులేట్ భవనాన్ని 12 ఎకరాల్లో అధునాతన పరిజ్ఞానంతో నిర్మించినట్లు తెలిపారు వేదాంత్ పటేల్. అమెరికాతో వాణిజ్యానికి సంబంధించి హైదరాబాద్ లోని కాన్సులేట్ కార్యాలయం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
వీసా కేంద్రంగా హైదరాబాద్
భారత్ లో అమెరికా వీసా, ఎంబసీ కార్యకలాపాల కోసం నాలుగు కాన్సులేట్ లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ లోని కాన్సులేట్ అతిపెద్దది. తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్ వీసాతో పాటు వాణిజ్య, పర్యాటక, డిపెండెంట్ వీసాల అవసరాలకు హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కు రావడం తప్పనిసరి. వీసా ఇంటర్వ్యూలన్నీ నానక్ రాం గూడలోని కొత్త అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో జరుగుతాయి.