హామీలు అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది
గ్యారంటీలపై సీఎం, మంత్రులు పొంతనలేకుండా మాట్లాడుతున్నరు : శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి
హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటున్నారని.. అంటే హామీల అమలు సంగతి ఇక అంతేనని తేలిపోతుందన్నారు. గ్యారంటీలు, హామీల అమలుపై సీఎం, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు హామీల అమలుపై ప్రశ్నిస్తే.. తమకు ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహన ఉందని భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. అప్పుల గురించి కూడా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.1.43 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారింలోకి వచ్చి 420 రోజులు పూర్తయిన సందర్భంగా హామీలు అమలు చేయలేకపోతున్న ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించామని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ప్రజల ఓట్లు కొళ్లగొట్టేందుకు దొంగ గాంధీలు తెలంగాణకు వచ్చి తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చారని.. ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం చార్ సౌ బీస్గా మారిందన్నారు. రైతుభరోసా, రుణమాఫీ, రేషన్ కార్డుల జారీలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేసీఆర్‌పై అబద్దాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ నేతలు గోబెల్స్‌ను మించిపోయారన్నారు. అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ అందులో పదో వంతు ఉద్యోగాలు కూడా ఇప్పించలేకపోయారని అన్నారు. గురుకులాల పరిస్థితి అధ్వనంగా మారిందని, యూరియా కోసం రైతులు క్యూలైన్లలో చెప్పులు పెట్టే పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు.