89 నియోజకవర్గాలకు 189 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారట.. టీటీడీపీ చెబుతోంది నిజమేనా?
టీటీడీపీ అభ్యర్థుల జాబితాతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ రోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అధినేత చంద్రబాబుతో ములాఖత్ అవుతారని సమాచారం. అక్కడే లిస్ట్ ఫైనల్ చేసే అవకాశాలున్నాయంటున్నారు.
ఓ పక్క అధినేత కారాగారవాసం. మరో పక్క గత ఎన్నికల నుంచి క్షీణిస్తున్న ప్రాభవం.. ఒక్కొక్కరుగా పార్టీ వీడిపోయిన ముఖ్యనేతలు.. ఇన్ని ఇబ్బందుల మధ్య తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 89 స్థానాల్లో పోటీకి 189 మంది రెడీగా ఉన్నారని టీటీడీపీ చెబుతున్నది నిజమేనా లేక మేకపోతు గాంభీర్యమా అనేది తేలాల్సి ఉంది.
ఒక్కోస్థానానికి ఇద్దరు, ముగ్గురు పోటీపడేంత ఉందా?
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ సహా పలుచోట్ల కలిపి మొత్తం 30 స్థానాల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నిస్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లేనని, ఇంకొన్నిచోట్ల ఇద్దరు, మరికొన్నిచోట్ల ముగ్గురు చొప్పున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారని టీటీడీపీ వర్గాల విశ్లేషణ. అసలు తెలంగాణలో గెలుపు ఆశలే లేని టీడీపీ టికెట్ కోసం నిజంగా అంతమంది పోటీ పడుతున్నారంటే అదెంత వరకు నిజమన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న.
ఎక్కడ టికెట్ దొరికినా పోటీకి సై అనేవారికి మంచి ఛాన్స్
టీటీడీపీ అభ్యర్థుల జాబితాతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ రోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అధినేత చంద్రబాబుతో ములాఖత్ అవుతారని సమాచారం. అక్కడే లిస్ట్ ఫైనల్ చేసే అవకాశాలున్నాయంటున్నారు.నిజంగా పోటీకి అభ్యర్థులున్నారా అంటే ఏమో ఎక్కడ టికెట్ దొరికినా పోటీ చేసి, కాస్త వార్తల్లో నిలబడదామనే వ్యక్తులకు కొదవేముంది!కాబట్టి మనం ఎప్పడూ వినని, అసలు టీడీపీలో ఎప్పుడూ పెద్దగా కనపడని వ్యక్తులు అసెంబ్లీ ఎన్నికల బరిలో సైకిల్ గుర్తుపై పోటీపడొచ్చు. కానీ ఒకనాడు తెలంగాణలో ప్రధాన పార్టీగా చాన్నాళ్లపాటు అధికార, విపక్ష హోదా కూడా అనుభవించిన టీడీపీ ఇప్పుడు అనామక అభ్యర్థులతో జాబితా ప్రకటిస్తే మాత్రం ఆ పార్టీకి తెలంగాణలో అదే అతి పెద్ద విషాదం!