కెసిఆర్ వ్యాఖ్యలతో బిజెపిలో ప్రకంపనలు..ఆరా తీస్తున్న అగ్రనేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశం అతర్వాత బీజేపీ అగ్రనేతల్లోప్రకంపనలు మొదలయ్యాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని పార్టీ పెద్దలతో సమావేశమై చర్చిస్తున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) బండారాన్ని ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ (టిఆర్ఎస్) అధినేత కెసిఆర్ బట్టబయలు చేసి చీల్చి చెండాడంపై బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కెసిఆర్ మీడియా సమావేశంపై బిజెపి అగ్రనేతలు ఆచితూచి వ్యవహరిస్తూ పూర్తి వివరాల పై ఆరా తీస్తున్నారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని పార్టీ పెద్దలతో సమావేశమై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్ వంటి రాష్ట్ర నాయకులతో మాట్లాడుతూ కెసిఆర్ వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై న్యాయ సలహాలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. కెసిఆర్ సమావేశంలో బిజెపి అగ్రనేతల పేర్లను ప్రస్తావించడంతో పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.
కెసిఆర్ మీడియా సమావేశంలో మొయినాబాద్ ఫాంహౌస్ లో బిజెపి ప్రతినిధులు జరిపిన సంభాషణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఏ విధంగా అపహాస్యం చేస్తుందో ఈ వీడియోలే సాక్ష్యమని వివరించారు. ఎనిమిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏ విధంగా కూలగొట్టారో కూడా ఈ ప్రతినిధులు చెప్పారని, సిగ్గు, లజ్జ లేకుండా వ్యవహరిస్తున్న బిజెపి స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేస్తానని అన్నారు.
మొత్తం ఈ వ్యహారంలో బిజపి అగ్రనాయకుల పేర్లు కూడా ప్రస్తావిచండంతో వారి ప్రమేయంతోనే ఈ దుర్మార్గ చర్యలకు బిజెపి పాల్పడిందని అర్ధమవుతోందన్నారు. ఈ వివరాలన్నింటినీ దేశంలోని న్యాయమూర్తులందరికీ పంపుతున్నామని, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రాజకీయ పార్టీలకు పంపుతున్నట్టు చెప్పారు. దీంతో బిజెపి ప్రతిష్ట మరింత దిగజారుతుందని ఆ పార్టీ అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే మొయినాబాద్ ఫాం హౌస్ వీడియోలు బహిర్గతమవడంతో బిజెపి అనైతిక చర్యలు ప్రపంచానికి తెలిశాయి. తాజాగా ఈ వీడియోల వెనక బిజెపి కుతంత్రాలను ముఖ్యమంత్రి ఎండగడుతూ వెల్లడించిన వివరాలు ప్రజాస్వామ్య వాదులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంత జరిగినా బిజెపి ఈ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని బుకాయించడం, వారంతా పెయిడ్ ఆర్టిస్టులంటూ చేస్తున్న వ్యాఖ్యలు, చెబుతున్న అవాస్తవాలు బిజెపి నిస్సహాయ స్థితిని తేటతెల్లం చేస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.