కాంగ్రెస్‌కు 80, బీఆర్ఎస్‌కు 25, మిగిలినవి బీజేపీకి.. - రేవంత్ జోస్యం

రాష్ట్రంలో అసలు బీజేపీ తమకు పోటీ కాదన్నారు. ఆ పార్టీకి కేవలం సింగిల్ డిజిట్ లోనే స్థానాలు వస్తాయని చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement
Update:2023-04-04 19:11 IST

వచ్చే ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో ఎవరి పొత్తూ అవసరం లేకుండా 80 సీట్లు సాధించి అధికార పీఠం ఎక్కుతామని చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసలు బీజేపీ తమకు పోటీ కాదన్నారు. ఆ పార్టీకి కేవలం సింగిల్ డిజిట్ లోనే స్థానాలు వస్తాయని చెప్పారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

బీజేపీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిదాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతూ వ‌స్తున్నారు. కేంద్రం త‌ప్పిదాల‌ను ఎత్తిచూపుతూనే ఉన్నారు. అయితే నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బీజేపీ కంటే ఎక్కువ బలమే ఉంది. కార్యకర్తలూ ఉన్నారు. కానీ, స్వీయ తప్పిదాల వల్ల ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆటలో అరటిపండులా మారిపోయింది.

ఇదిలా ఉంటే.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డికి మీడియా ఫోకస్ ఎక్కువే. నిత్యం వార్తల్లో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆయన పాదయాత్రకు పెద్దగా కవరేజ్ దక్కడం లేదు. వార్త‌ల్లో నిలిచేందుకు బీజేపీ మాత్రం నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి తమ పోటీ బీఆర్ఎస్ తోనేనని స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నిజంగానే అంత సీన్ ఉందా..? అన్నది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News