సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు : మందకృష్ణ మాదిగ
మాదిగలను నమ్మించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా, నమ్మే పరిస్థితి లేదని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
మాదిగలను మోసం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని మాటలు చెప్పిన నమ్మే పరిస్థితి లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే 11వేలకు పైగా టీచర్ల పోస్టులు భర్తీ చేశారని విమర్శించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు1న చెప్పిన మాటలకే విలువ లేదని కృష్ణ మాదిగ అన్నారు. ఇక నుంచైనా ఇచ్చిన సీఎం రేవంత్ మాట నిలబెట్టుకోవాలని కోరారు. గ్రూపు -1 పోస్టులకూ వర్గీకరణ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
వర్గీకరణ పూర్తయితేనే గ్రూపు-1 మెయిన్స్ నిర్వహించాలని అన్నారు. అంతేకాదు.. గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు కూడా వర్గీకరణ తర్వాతే నిర్వహించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ జరిగే వరకు పరీక్షలు మరో రెండు నెలలు ఆపాలని కోరారు. గ్రూప్-4 ఫలితాలు ఇప్పటికే 16 నెలలు ఆగాయని, వర్గీకరణ జరిగే వరకు మరో 2 నెలలు వాయిదా వేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ నెల 16న వరంగల్‌లో భారీ సమావేశం నిర్వహిస్తామని ఆ సమావేశంలో కమిటీల సభ్యులు పాల్గొంటారని అన్నారు. ఇప్పటివరకు ఆవేదనతోనే నిరసన చేశామని.. ఇకపై తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కృష్ణ మాదిగ హెచ్చారించారు.