మెట్రో, టీఎస్ఆర్టీసీ దెబ్బకు.. పడిపోతున్న ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య

ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు పూర్తి స్థాయిలోనే తిరుగుతున్నాయి. అయితే కరోనా కంటే ముందు ఉన్న ప్రయాణికుల కంటే ఇప్పుడు 50 శాతం తక్కువ మందే ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్నారు.

Advertisement
Update:2023-08-08 09:52 IST

హైదరాబాద్ నగరం రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణాను కూడా మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్ మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు టీఎస్ఆర్టీసీ కూడా శివారు ప్రాంతాలకు బస్సు సర్వీసులు పెంచింది. అయితే నగరవాసులకు ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న ఎంఎంటీఎస్ మాత్రం రోజు రోజుకూ కుదేలవుతోంది. సరైన ప్రణాళిక, లాస్ట్ పాయింట్ కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికుల ఆదరణ తగ్గిపోతోంది.

కరోనా తర్వాత ఎంఎంటీఎస్ సర్వీసులు పునరుద్దరించి 18 నెలలు అవుతోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు పూర్తి స్థాయిలోనే తిరుగుతున్నాయి. అయితే కరోనా కంటే ముందు ఉన్న ప్రయాణికుల కంటే ఇప్పుడు 50 శాతం తక్కువ మందే ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్నారు. ఇటీవలే కొత్తగా ప్రారంభించిన 13 ఎంఎంటీఎస్‌లతో కలిపి 86 రైళ్లను హైదరాబాద్‌లో నడిపిస్తున్నారు. అయితే వీటిలో ఆక్యుపెన్సీ 50 శాతం వరకు మాత్రమే ఉంటోంది. ప్రయాణించే వాళ్లు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తరచూ ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నారు.

గత నెల 15న 22 ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య నడిచే 12 రైళ్లు, ఉంధానగర్ - లింగంపల్లి మధ్య నడిచే ఐదు రైళ్లు, లింగంపల్లి - ఫలక్‌నూమా మధ్య నడిచే నాలుగు రైళ్తతో పాటు రామచంద్రాపురం - ఫలక్‌నామా ఎంఎంటీఎస్‌ను కూడా రద్దు చేశారు. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగానే వీటిని రద్దు చేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆక్యుపెన్సీ తగ్గడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్‌లోని పలు రంగాలకు చెందిన కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లోనే పని చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రీడ్ మోడల్‌లో పని చేయడానికి అవకాశం ఇచ్చాయి. మరోవైపు ఐటీ కారిడార్ వైపు వెళ్లడానికి ఎంఎంటీఎస్ కంటే మెట్రో చాలా సులువుగా ఉన్నది. నగరంలోని కీలకమైన ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ వరకు నేరుగా వెళ్లడానికి మెట్రో ఉపయోగపడుతుంది. అందుకే హైదరాబాద్ మెట్రోలో రద్దీ పెరిగిపోయింది. అదే సమయంలో ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గింది.

కరోనా పాండమిక్ తర్వాత ప్రజలు తమ రవాణా పద్దతుల్లో చాలా మార్పులు చేసుకున్నారు. ఎక్కువ మంది సొంత వాహనాలను వాడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పరంగా మెట్రో, ఆర్టీసీ తర్వాతే ఎంఎంటీఎస్‌ను ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే రైళ్ల ఆక్యుపెన్సీ తగ్గిపోయిందని ఒక అధికారి చెప్పారు. సబ్‌అర్భన్ ప్రాంతాల్లో ఉండే వారికి ఎంఎంటీఎస్, మెట్రో రెండూ అందుబాటులో లేవు. వీళ్ల కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. చాలా మంది దగ్గర్లోని మెట్రో స్టేషన్ల వరకు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

అయితే ఎంఎంటీఎస్‌లో ఎక్కువ రద్దీ ఉండే హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో రైళ్ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. తరచూ రైళ్లను రద్దు చేయడం వల్ల కూడా ఎంఎంటీఎస్‌కు ఆదరణ తగ్గిపోతోందని కూడా ప్రయాణికులు చెబుతున్నారు. మెట్రో స్టేషన్లు ఇళ్లకు దగ్గరగా ఉండటం.. ఎంఎంటీఎస్‌తో పోల్చుకుంటే చార్జీలు ఎక్కువైనా.. రైళ్ల ఫ్రీక్వెన్సీ బాగుంటం వల్ల ఎక్కువ మంది దీన్నే ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల ఎంఎంటీఎస్‌కు ఆదరణ పెంచాలని.. మెట్రో ప్రయాణికులను ఆకర్షించాలని ఫస్ట్ క్లాస్ టికెట్ రేట్లు 50 శాతం మేర తగ్గించారు. అయినా సరే ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నది. టికెట్ రేట్లు, రైళ్ల సమయాలు చాలా మందికి తెలియకపోవడం వల్ల కూడా ఎంఎంటీఎస్ వైపు ఎవరూ చూడటం లేదని తెలుస్తున్నది. అందుకే దక్షిణ మధ్య రైల్వే దీనిపై మరింత ఫోకస్ చేస్తే.. తప్పకుండా ఆదరణ ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News