టెన్త్ పేపర్ లీక్ కేసు.. ఈటల రాజేందర్‌కు పోలీసుల నోటీసులు!
హిందీ ప్రశ్నపత్రం లీక్ చేసిన ప్రశాంత్.. దాన్ని వాట్సప్‌లో ఈటల రాజేందర్, ఆయన పీఏకు పంపారు.
టెన్త్ హిందీ పరీక్ష పత్రం లీక్ కేసులో వరంగల్ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పేపర్ లీక్ విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఈ లీక్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయనే విషయంపై లోతుగా విచారిస్తున్నారు. తాజాగా బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వరంగల్ పోలీసులు నోటీసులు జారీ జారీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
హిందీ ప్రశ్నపత్రం లీక్ చేసిన ప్రశాంత్.. దాన్ని వాట్సప్‌లో ఈటల రాజేందర్, ఆయన పీఏకు పంపారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తన ఫోన్ రెండు రోజులుగా స్విచ్ ఆఫ్‌లో ఉందని ఒకసారి.. తాను వాట్సప్, సోషల్ మీడియా వంటివి ఉపయోగించనని మరో సారి చెప్పారు. కేవలం పచ్చ బటన్, ఎర్ర బటన్ నొక్కడం మాత్రమే తెలుసన్నారు.
ప్రశ్నపత్రం కమలాపూర్‌లోని ప్రభుత్వ బాయ్స్ స్కూల్ నుంచి లీక్ అయ్యింది. ఇది ఈటల ప్రతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నది. అసలు లీక్ చేయడానికి కుట్రదారులు ఈ సెంటర్‌నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌తో పాటు ఆయన పీఏకు కూడా వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
మరోవైపు బండి సంజయ్ రిమాండ్‌ని కొట్టివేయాలంటూ హైకోర్ట్‌లో బీజేపీ లీగల్ సెల్ లంచ్ మోషన్ పిటిషన్ వేయగా.. మరోవైపు సంజయ్‌ని కస్టడీ కోరుతూ వరంగల్ పోలీసుల పిటిషన్ వేశారు. బండి సంజయ్ మొబైల్ ఫోన్ ఇవ్వలేదని.. ఫోన్ డేటాతో పాటు లీకేజ్ కేసులో లోతుగా విచారించాలని.. కస్టడీ పిటిషన్‌లో వేర్వేరు అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు. బండి సంజయ్, ప్రశాంత్‌ను వారం పాటు పోలీసులు కస్టడీ కోరనున్నారు.