భద్రాచలం రక్షణకు రెండు కరకట్టలు.. రూ.1,625 కోట్లతో లైన్ ఎస్టిమేషన్

ప్రస్తుతం సిద్ధమైన లైన్ ఎస్టిమేషన్ మేరకు త్వరలోనే నీటి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు.

Advertisement
Update:2022-12-25 06:21 IST

గోదావరి వరద, పోలవరం బ్యాక్ వాటర్ నుంచి టెంపుల్ టౌన్ భద్రాచలాన్ని రక్షించడానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. భద్రాచలంతో పాటు సమీపంలో గోదావరికి ఇరువైపులా ఉన్న గ్రామాలను కూడా ముంపు నుంచి రక్షించడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. పట్టణానికి శాశ్వత రక్షణ కల్పించేందుకు గాను ప్రాథమిక అంచనాలను అధికారులు తయారు చేశారు. భద్రాచలం, బూర్గంపాడుకు ఇరు వైపులా కలిపి 58 లేదా 65 కిలోమీటర్ల పొడవున కరకట్టలు నిర్మించేందుకు ఇంజనీర్లు లైన్ ఎస్టిమేషన్లు రూపొందించారు.

గోదావరికి ఈ ఏడాది జనవరిలో భారీగా వరద వచ్చింది. ఇటీవల కాలంలో ఎన్నడూ రానంత భారీ వరద కారణంగా భద్రాచలం పట్టణంలో అంచనా వేయని ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. ముఖ్యంగా నదికి భారీ వరద వచ్చిన సమయంలో వాగుల ప్రవాహం స్తంభించి స్థానికంగా ముంపు పెరిగిపోతోంది. మరో వైపు మురుగు నీటి నాలాలు కూడా మూసుకొని పోయి.. వరద రివర్స్ వచ్చేస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రణాళికను సిద్ధం చేశారు. 58 కిలోమీటర్ల పొడవు అయితే రూ.1,585 కోట్లు, 65 కిలోమీటర్లు అయితే రూ.1,625 కోట్ల మేర ఖర్చ అవుతుందని అంచనాలు వేశారు.

గోదావరి నదికి కుడివైపున బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వరకు ఒక కట్ట.. ఎడమ వైపు భద్రాచలం మండలం సుభాష్‌నగర్ కాలనీ నుంచి దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామం వరకు రెండో కరకట్ట నిర్మిస్తారు. ఒక్కో వైపు 30 నుంచి 35 కిలోమీటర్ల పొడవు ఉండేలా ఈ కట్టలు నిర్మించనున్నారు. అయితే.. నది వెంబడి బారుగా కరకట్టలు నిర్మించకుండా.. గ్రామాలు వచ్చిన దగ్గర కొంత గ్యాప్ తీసుకొని.. అక్కడ 'యూ' ఆకారంలో కట్టలను కట్టాలని ప్రాథమిక అంచనాలు వేశారు.

ఇక వాగుల నుంచి వచ్చే నీళ్లు నదిలోకి వెళ్లేందుకు వీలుగా కట్టలు నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధ్యయనం కోసం స్వతంత్ర సంస్థకు పనులు అప్పగించారు. ప్రస్తుతం సిద్ధమైన లైన్ ఎస్టిమేషన్ మేరకు త్వరలోనే నీటి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. ఆ తర్వాత డీపీఆర్‌ను మరో సంస్థ కలిసి రూపొందిస్తారు.

ఇక ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కూడా గోదావరి ముంపు ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరికి వరద నీరు విడుదలయ్యే సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నాలుగు లక్షల క్యూసెక్కల నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైతే నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ముంపు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా కరకట్టలు నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నది. దీనిపై కూడా త్వరలో అధ్యయనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News