ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులు.. గెజిట్ విడుదల

వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ సబార్డినెట్ సర్వీస్‌ రూల్స్ వర్తిస్తాయి. వీటి కింద ఆర్టీసీ ఉద్యోగులను పరిగణించబోరని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి.

Advertisement
Update:2023-09-20 08:44 IST

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సర్కార్‌ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 15 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న నియమ నిబంధనలు యధాతథంగా అమలవుతాయని పేర్కొంది. తెలంగాణ ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో 43 వేల మందికి పైగా పని చేస్తున్నారు.

విలీన ప్రక్రియలో ఏపీ విధానాన్ని అనుసరించాలని తెలంగాణ సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నేతృత్వంలో కొంతమంది అధికారుల బృందం అధ్యయనం మొద‌లుపెట్టింది. ముందుగా ఉద్యోగుల వేతనాలు, సీనియారిటీలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా ఉద్యోగుల కేడర్‌ను నిర్ధారించనున్నారు. కండక్టర్‌, డ్రైవర్‌ పోస్టులను జూనియర్‌ అసిస్టెంట్లుగా లేక సీనియర్‌ అసిస్టెంట్లుగా పరిగణించాలా అనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. సీనియారిటీ, వేతనం ఎక్కువ ఉన్న డ్రైవర్‌, కండక్టర్లను సీనియర్‌ అసిస్టెంట్లుగా పరిగణించవచ్చని తెలుస్తోంది.

వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ సబార్డినెట్ సర్వీస్‌ రూల్స్ వర్తిస్తాయి. వీటి కింద ఆర్టీసీ ఉద్యోగులను పరిగణించబోరని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. సబార్డినేట్ రూల్స్ వర్తింపజేస్తే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఆర్టీసీ ఉద్యోగులకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయకుండానే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆర్థిక ప్రయోజనాలు అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేడర్‌ను నిర్ధారించిన తర్వాత పూర్తి స్థాయి జీవో విడుదల కానుంది. ఇందుకు మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ తమిళి సై గతవారం ఓకే చెప్పారు. దీంతో న్యాయశాఖ కార్య‌ద‌ర్శి గెజిట్ విడుదల చేశారు.

*

Tags:    
Advertisement

Similar News