రైతుల్ని దగా చేసి, రైతులకోసం ధర్నాలా..?

కేవలం రైతుల్ని మభ్యపెట్టి, పసుపుబోర్డ్ హామీతోనే నిజామాబాద్ నుంచి అరవింద్ ఎంపీగా గెలిచారు. అయితే ఎన్నికల్లో గెలిచి మూడేళ్లవుతున్నా నిజామాబాద్ కి పసుపు బోర్డ్ రాలేదు. అంటే అరవింద్ ఎంపీగా విఫలమైనట్టే కదా అని ప్రశ్నించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

Advertisement
Update:2022-08-16 07:40 IST

బీజేపీకి అన్నదాతలపై ఎంత ప్రేమ ఉందో రైతు చట్టాల విషయంలోనే తేలిపోయింది. ఆ మాటకొస్తే.. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఫసల్ బీమా కార్యక్రమాన్ని అమలు చేయడంలేదు. దేశంలో రైతుల తరఫున బీమా ప్రీమియం మొత్తాన్ని జమ చేస్తూ రైతులకు అండగా నిలబడిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అలాంటి తెలంగాణలో రైతు సమస్యలపై బీజేపీ ఎంపీ పోరాటం చేయడాన్ని ఎలా చూడాలి. దేశవ్యాప్తంగా రైతుల్ని నట్టేట ముంచే నిర్ణయాలు తీసుకుంటూ, తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వంపై కూడా బురదజల్లాలనుకునే నేతల్ని ఏమనాలి..? టీఆర్ఎస్ నేతలు బీజేపీ ఎంపీ అరవింద్ పై ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. బీజేపీ ఎంపీగా ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో రైతులకోసం ధర్నా చేస్తారంటూ అరవింద్ పై మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

పసుపు బోర్డ్ కథేంటి..?

గతంలో నిజామాబాద్ ఎన్నికల్లో పసుపుబోర్డ్ అంశం కీలకంగా మారింది. స్థానికంగా పసుపు బోర్డ్ డిమాండ్ చేస్తూ రైతులు గత ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రైతులే నామినేషన్లు వేసి తమ సత్తా చూపించారు. కేవలం రైతుల్ని మభ్యపెట్టి, పసుపుబోర్డ్ హామీతోనే నిజామాబాద్ నుంచి అరవింద్ ఎంపీగా గెలిచారు. అయితే ఎన్నికల్లో గెలిచి మూడేళ్లవుతున్నా నిజామాబాద్ కి పసుపు బోర్డ్ రాలేదు. అంటే అరవింద్ ఎంపీగా విఫలమైనట్టే కదా అని ప్రశ్నించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. సింగిల్ అజెండాతో ఎన్నికల్లో రైతుల్ని మోసం చేసిన అరవింద్, ఇప్పుడు తన అసమర్థతను కప్పి పుచ్చుకోడానికే ఇలా ధర్నాలంటూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ కి రైతులపై ప్రేమ..

అరవింద్ మాటలు నమ్మితే.. రైతన్నలు మళ్లీ మోసపోతారని చెప్పారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రైతులపై కేసీఆర్‌ కు ఉన్నంత ప్రేమ.. ఈ ప్రపంచంలోనే మరెవ్వరికీ లేదని తెలిపారాయన. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో కూడా అమలులో లేవన్నారు. పసుపు బోర్డ్ తెస్తానని చెప్పి మోసం చేశారంటూ గతంలో అరవింద్ ఇంటి ముందు పసుపు రైతులు ధర్నాకు దిగిన విషయాన్ని కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. తనపై వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకోడానికే బీజేపీ నేతలు ఇలాంటి డ్రామాలాడుతున్నారని, ప్రజలు ఓ కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News