గొప్ప లక్ష్యాలకు చేరాలంటే.. సానుకూల దృక్పథంతో సాగాలి: మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువతలో దయ, కరుణ అనేవి ఉండాలని మహాత్మా గాంధీ బోధించిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement
Update:2022-08-12 14:54 IST

గొప్ప లక్ష్యాలకు చేరుకోవాలంటే.. అవిశ్రాంతంగా పని చేస్తూ, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. వర్చువల్ పద్దతిలో ఆయన యువతకు దిశానిర్దేశం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువతలో దయ, కరుణ అనేవి ఉండాలని మహాత్మా గాంధీ బోధించిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ గత 8 ఏళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో విస్తృతంగా కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త ఇన్వెన్షన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు హైదరాబాద్ పెట్టింది పేరని చెప్పారు. నేటి సాంకేతిక రంగంలోని విప్లవాత్మక మార్పులతో హైదరాబాద్ పోటీ పడుతోందని వివరించారు. ఒకవైపు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాల్లో ఐటీ వేగంగా దూసుకెళ్తోందని.. అదే సమయంలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయ రంగంలో కూడా పురోగతిని సాధించేలా చేశారన్నారు.

వ్యవసాయ రంగంలో తెలంగాణ విప్లవాత్మక మార్పు సాధించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సెల్ఫ్ ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత.. అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు తయారవుతున్నారని వెల్లడించారు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాబట్టి యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా.. పారిశ్రామికవేత్తలుగా కూడా మారడానికి అవసరమైన స్కిల్స్ నేర్చుకోవాలని ఆయన చెప్పారు.

కోవిడ్ సమయంలో రామచంద్ర మిషన్, కన్హా శాంతివనం నేతృత్వంలో చేసిన సేవలను మంత్రి కొనియాడారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సుకు రామచంద్ర మిషన్ గ్లోబల్ గురు కమలేశ్. డి. పటేల్, యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్ డాక్టర్ అనంత దురైయప్ప, ఏఆర్ రెహ్మాన్ ఫౌండేషన్ డైరెక్టర్ ఖతీజా రెహ్మాన్ హాజరయ్యారు. దేశ, విదేశాలకు చెందిన యువత, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News