మాకెన్ని సీట్లిస్తారో చెప్పినాకే.. ప్రచారం ముచ్చట అంటున్న మహిళా కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలో గురు ,శుక్రవారాల్లో జరిగిన మహిళా కాంగ్రెస్ జాతీయ సదస్సులో తెలంగాణ నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఇతర నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో అధికారం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు దారిలో ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు రేవంత్‌రెడ్డికి కీలక నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఒక్కొక్కటిగా అన్నీ సర్దుకుంటూ వస్తుంటే ఇప్పుడు పార్టీకి పట్టున్న స్థానాల్లో టికెట్ల కోసం పోటీ మొదలైంది. మరోవైపు మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా మాకు మస్తు సీట్లు కావాలని అల్టిమేటం ఇస్తున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహిళా కాంగ్రెస్ నేతలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో గురు ,శుక్రవారాల్లో జరిగిన మహిళా కాంగ్రెస్ జాతీయ సదస్సులో తెలంగాణ నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఇతర నేతలు పాల్గొన్నారు. అక్కడే పార్టీ అగ్రనేతలతో మాట్లాడామని, తమకెన్ని సీట్లిస్తారో తేల్చాలని గట్టిగా చెప్పామని సునీతారావు తెలిపారు.
ఎప్పటి మాదిరిగా సీట్లు అడగటం, ఒకటో రెండో ఇస్తే సరిపెట్టుకోవడం ఇప్పుడు కుదరదన్నట్లు మహిళా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సారి తమ నాయకురాళ్లు బలంగా ఉన్నచోట్ల టికెట్లు అడుగుతామని, అక్కడ ఇవ్వకపోతే ఇంటింటి ప్రచారానికి వెళ్లబోమని తేల్చి చెప్పేస్తున్నారు. మరి మహిళా నేతల అల్టిమేటంకు టీపీసీసీ పెద్దలు ఎలా రియాక్టవుతారో చూడాలి.