గృహజ్యోతికి కోడ్ అడ్డు.. లబ్ధిదారుల అవస్థలు
గత నెలలో జీరో బిల్లు జారీ అయిన 36 లక్షల మందికి మాత్రమే ఈనెలలో కూడా పథకం అమలవుతుంది. వీరి బిల్లుల మొత్తం సొమ్ము రూ.125 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు విడుదల చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో కొన్నిటిని అమలులో పెట్టింది. అందులో గృహజ్యోతి పథకం ఒకటి. 200 యూనిట్లకంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి బిల్లు లేకుండా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గత నెలలో 36 లక్షలమంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుకున్నారు. అయితే చాలామంది అర్హులకు కూడా కరెంటు బిల్లులు రావడంతో వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈలోగా లోక్ సభ ఎన్నికల కోడ్ అడ్డురావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
తెలంగాణలో మొత్తం 80లక్షలమంది రేషన్ కార్డులు ఉన్నవారు గృహజ్యోతి పథకానికి అర్హులని తేలింది. వారిలో తొలినెల 36లక్షలమందికి మాత్రమే జీరో బిల్లులు అందాయి. మిగతా వారికి వివిధ కారణాల వల్ల కరెంటు బిల్లులు జనరేట్ అయ్యాయి. అయితే వారు కూడా దరఖాస్తు చేసుకుంటే జీరో బిల్లు ఇస్తామని మంత్రులు క్లారిటీ ఇచ్చారు. ఆ దరఖాస్తులన్నీ అధికారుల వద్ద పెండింగ్ లో ఉండగానే కోడ్ రావడంతో వాటిని పక్కనపెట్టారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ దరఖాస్తులకు మోక్షం లభిస్తుందని అంటున్నారు.
కోడ్ ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో దరఖాస్తులను స్క్రూట్నీ చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామంటున్నారు అధికారులు. ప్రస్తుతానికి గత నెలలో జీరో బిల్లు జారీ అయిన 36 లక్షల మందికి మాత్రమే ఈనెలలో కూడా పథకం అమలవుతుంది. వీరి బిల్లుల మొత్తం సొమ్ము రూ.125 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు విడుదల చేసింది. మిగతా వారు మాత్రం అర్హులయినా కూడా మరో రెండు నెలలు కరెంటు బిల్లులు కట్టుకోవాల్సిందేననమాట.