అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో

3,989 మినీ అంగన్‌వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Update:2023-09-13 05:12 IST

తెలంగాణలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లరకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీలుగా మారుస్తూ జీవో జారీ చేసింది. దీంతో పాటు టీచర్ల, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇక ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లకు రూ.50వేలు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆసరా పెన్షన్లు అందించాలని జీవోలో పేర్కొన్నారు.

అంగన్‌వాడీలపై ఒత్తిడి తగ్గించేందుకే ఇప్పటికే ఉన్న యాప్‌ను మరింత సులభతరం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 3,989 మినీ అంగన్‌వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీచర్లు, వర్కర్లకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నాము. ఇప్పుడు మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేయడంతో ఆ టీచర్లకు కూడా వేతనాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు.

అంగన్‌వాడీల్లో కేంద్ర సర్కారు వాటా 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందని చెప్పారు. రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కేంద్రం వాటి 60 శాతం ఉండాల్సి ఉండగా.. టీచర్లకు కేవలం 19 శాతం, హెల్పర్లకు 17 శాతం మాత్రమే చెల్లిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలపై రూ.115 కోట్ల భారాన్ని మోస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాల కోసం 40 శాతం చెల్లించాల్సి ఉండగా.. ఏకంగా 82 శాతం చెల్లిస్తోందని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు అంగన్‌వాడీలపై ఉన్న ప్రేమకు ఈ జీవోనే నిదర్శనమని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News