ఆంక్షలు లేవు.. ధర్నా చౌక్ లో ఇక మీ ఇష్టం
ధర్నా చౌక్ లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి. ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చని, ధర్నాలు జరిగే సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తి కూడా లేదన్నారు.
ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో ఆందోళనలు, నిరసనలపై ఇప్పటి వరకూ ఆంక్షలుండేవి. ఇకపై ఆ ఆంక్షలేవీ లేకుండా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సూచన మేరకు ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగిస్తామంటున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు ఆయన ధర్నాచౌక్ ని పరిశీలించారు. అనంతరం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్నాచౌక్ వ్యవహారంలో ఆంక్షలు ఉండబోవన్నారు.
ధర్నా చౌక్ లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి. ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చని, ధర్నాలు జరిగే సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తి కూడా లేదన్నారు. ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ధర్నాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నాలు చేపట్టవచ్చని చెప్పారు.
నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి..
నగరంలో రెండు రోజులుగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అసెంబ్లీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిన మాట వాస్తవమే అని, అయితే ట్రాఫిక్ ను పూర్తిగా క్లియర్ చేసేందుకు తమ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారని చెప్పారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. ప్రజావాణి జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. ప్రజావాణి కోసం వచ్చే ఫిర్యాదు దారులకు సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని చెప్పారు.