హెచ్‌సీఏ తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

టికెట్ల విక్రయం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం సీరియస్‌గా ఉన్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి చెప్పారు. అసలు టికెట్లను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఎందుకు విక్రయించారో తెలపాలని ఆదేశించారు.

Advertisement
Update:2022-09-22 17:52 IST

ఇండియా-ఆస్ట్రేలియా 3వ టీ20 మ్యాచ్‌కు టికెట్ల విక్రయం విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆన్‌లైన్ పద్దతిలో మ్యాచ్ టికెట్లు విక్రయించే వీలున్నా.. ఆఫ్‌లైన్ విక్రయాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాల్లో తోపులాట, లాఠీ చార్జీ జరగడంతో జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. వెంటనే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఫోన్ చేసి హెచ్‌సీఏ నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. దీంతో మంత్రి హుటాహుటిన రవీంద్ర భారతిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, క్రీడా శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

టికెట్ల విక్రయం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం సీరియస్‌గా ఉన్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి చెప్పారు. అసలు టికెట్లను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఎందుకు విక్రయించారో తెలపాలని ఆదేశించారు. ఇది పూర్తిగా హెచ్‌సీఏ నిర్లక్ష్యమే అని స్పష్టం చేశారు. క్రికెట్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలుసు. మూడేళ్ల తర్వాత నగరంలో మ్యాచ్ జరుగుతుండటంతో టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుందని కూడా తెలుసు. ఇన్ని తెలిసిన హెచ్‌సీఏ బాధ్యతారాహిత్యంగా ఎందుకు వ్యవహరించిందని ప్రశ్నించారు. అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయో? ఆన్‌లైన్‌లో ఎన్ని అమ్మారో? ఆఫ్‌లైన్‌లో ఎన్ని అమ్ముతారో? ఎప్పుడు అమ్ముతారో? అనే విషయాలపై కనీస సమాచారం ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నట్లు తెలిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్‌సీఏ ప్రతినిధులను హెచ్చరించారు. తెలంగాణ ప్రతిష్ట, బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఎవరు వ్యవహరించినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కాగా, సమావేశం అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉప్పల్‌లో జరిగే మ్యాచ్ ప్రైవేటు కార్యక్రమం. అయితే దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి ముందే ఇస్తే.. తగిన ఏర్పాట్లు చేసేవాళ్లం. కానీ, హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదని మంత్రి చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని అసోసియేషన్‌కు చెప్పామన్నారు. ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ప్రింట్ చేసిన టికెట్లన్నింటినీ విక్రయించమని చెప్పాం. బ్లాక్‌లో అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై ఉప్పల్ స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లు జరిగినా ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించామని మంత్రి తెలిపారు.

క్రికెట్ అభిమానులు కూడా కాస్త సమన్వయం పాటించాలని మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌ కోరారు. టికెట్ల కోసం ఎగబడాల్సిన అవసరం లేదని.. దొరికితే టికెట్ కొనుక్కొని చూడండి. లేకపోతే టీవీల్లో చూసే వెసులు బాటు ఉంది కదా అని అన్నారు. అనవసరమైన ఆవేశాలకు పోయి జీవితాలను పాడు చేసుకోవద్దని మంత్రి సలహా ఇచ్చారు. ఈ విషయంలో బీసీసీఐకి లేఖ రాస్తామని.. ఇకపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తామని మంత్రి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News