రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు

ఇది కచ్చితంగా బీఆర్ఎస్ విజయమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. తాము కాల్ సెంటర్ పెట్టడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చిందని, స్పెషల్ డ్రైవ్ అంటూ మంత్రి పొన్నం బయటకు వచ్చారని అంటున్నారు.

Advertisement
Update:2024-08-13 06:54 IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా చేపట్టిన రుణమాఫీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. రెండు విడతల్లోనూ రుణమాఫీ కాని అర్హులు చాలామంది ఉన్నారు. వారంతా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ జరిగిందని, ఇప్పుడెందుకు కావడంలేదని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. బాధితులకోసం ఏకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అర్హులై ఉండి, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్.

రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవాలనుకుంది. తొలి విడత సమయంలో ఊరూవాడా ర్యాలీలు జరిగాయి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పొలాల్లో పాలాభిషేకాలు జరిగాయి. కానీ రుణమాఫీ కాని రైతులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. వారందర్నీ బీఆర్ఎస్ ఓ దగ్గరకు చేరుస్తోంది. బాధితుల కష్టాలను ప్రభుత్వానికి తెలిపేందుకు కాల్ సెంటర్ నిర్వహిస్తోంది. దీంతో సహజంగానే రైతులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. తమని కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలపాలు చేయగా, బీఆర్ఎస్ ఓదారుస్తోందని అంటున్నారు. ప్రతిపక్షంపై రైతుల్లో సింపతీ పెరుగుతుండటంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది.

ఆల్రడీ ఉచిత విద్యుత్, విత్తన పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. రైతుబంధు ఆపేసి, రుణమాఫీ పేరుతో డ్రామాలాడుతున్నారనే అపవాదు కూడా ఉంది. ఇప్పుడు అర్హులకు కూడా రుణమాఫీ కాకపోవడంతో వారంతా కాంగ్రెస్ ని తిట్టిపోస్తున్నారు. అందుకే నష్టనివారణ చర్యలు చేపట్టారు. నెలరోజులపాటు స్పెషల్ డ్రైవ్ అంటున్నారు. ముందే అర్హుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇన్నిరోజులు వారు ఆందోళన పడేవారు కాదు కదా అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. స్పెషల్ డ్రైవ్ తర్వాతయినా అర్హులకు న్యాయం జరిగితే అదే చాలు అనుకుంటున్నారు. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ విజయమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. తాము కాల్ సెంటర్ పెట్టడం వల్లే ప్రభుత్వం దిగి వచ్చిందని, స్పెషల్ డ్రైవ్ అంటూ మంత్రి పొన్నం బయటకు వచ్చారని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News