తెలంగాణ కాంగ్రెస్ లో ఫ్యామిలీ ప్యాక్..

ప్యారాచూట్ నేత మైనంపల్లికి రెండు టికెట్లు ఇస్తే సీనియర్లయిన మాకెందుకివ్వరంటూ మిగతావాళ్లు స్వరం పెంచారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంది.

Advertisement
Update:2023-10-10 17:05 IST

తండ్రికి ఓ టికెట్, కొడుక్కి మరో టికెట్..

భర్తకు టికెట్, భార్యకు ఇంకోచోట టికెట్

అక్కకు టికెట్, తమ్ముడికి కూడా కావాలి టికెట్..

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ ఇది. సకుటుంబ సపరివార సమేతంగా టికెట్ల రేసులో ఉన్నారు కొంతమంది నేతలు. వాస్తవానికి ఉదయ్ పూర్ డిక్లరేషన్ తో ఈ కుటుంబ టికెట్ల విధానానికి కాంగ్రెస్ చెక్ పెట్టాలనుకుంది. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అని తీర్మానించింది. కానీ మైనంపల్లి సడన్ ఎంట్రీతో ఆ తీర్మానమే గాల్లో కలిసిపోయింది.

కాంగ్రెస్ లో మైనంపల్లి ఎంట్రీకి ముందు గాంధీ భవన్ లో జరిగిన ఓ మీటింగ్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాయల యుద్ధం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతిని కూడా అసెంబ్లీ బరిలో దింపాలనుకున్నారు. కానీ రేవంత్ కుదరదన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ని ప్రస్తావించారు. ఆ గొడవ మరచిపోక ముందే మైనంపల్లి ఎపిసోడ్ మొదలైంది. బీఆర్ఎస్ లో మైనంపల్లి హన్మంతరావుకి మల్కాజ్ గిరి టికెట్ ఖాయమైంది. కానీ తన కొడుక్కి మెదక్ సీటు కూడా కావాలని డిమాండ్ చేశారు మైనంపల్లి. చివరకు రెండు టికెట్ల హామీతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ప్యారాచూట్ నేత మైనంపల్లికి రెండు టికెట్లు ఇస్తే సీనియర్లయిన మాకెందుకివ్వరంటూ మిగతావాళ్లు స్వరం పెంచారు.

ఎవరెవరికి ఎన్నెన్ని టికెట్లంటే..?

ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో పాటు తన భార్య పద్మావతి రెడ్డికి టికెట్ కావాలని గట్టిగా పట్టుబట్టే అవకాశముంది. అటు జానారెడ్డి తాను ఎంపీగా పోటీ చేస్తూ తన ఇద్దరు కుమారులకు టికెట్లు అడుగుతున్నారు. జైవీర్ రెడ్డికి నాగార్జునసాగర్, రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు సీనియర్ నేత జానా. మరో సీనియర్ నేత మల్లు రవి కూడా తన కొడుకు సిద్దార్థ్ కి అసెంబ్లీ టికెట్ కావాలంటున్నారు. కొండా మురళి, కొండా సురేఖ కూడా ఈసారి అసెంబ్లీ బరిలో నిలబడతామంటున్నారు. తమ ఫ్యామిలీకి మూడు టికెట్లు కావాలని కొండా దంపతులు డిమాండ్ చేయడం విశేషం. కుమార్తె కొండా సుస్మితను కూడా ఈసారి అసెంబ్లీ బరిలో దింపాలనుకుంటున్నారు కొండా దంపతులు.

పీజేఆర్ కుటుంబం నుంచి విష్ణు, విజయ ఇద్దరూ టికెట్లు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క, ఈసారి తనతోపాటు తన కొడుకు సూర్యకి టికెట్ అడుగుతున్నారు. బలరాం నాయక్ కొడుకు సాయిశంకర్ నాయక్‌, మల్‌ రెడ్డి రంగారెడ్డి కొడుకు అభిషేక్‌ రెడ్డి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తండ్రికి టికెట్, కొడుక్కి మరో టికెట్ ఆశిస్తున్నారు. దామోదర రాజనర్సింహ తనతో పాటు తన కుమార్తె త్రిషకు టికెట్ ఆశిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ తనతోపాటు తన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కి కూడా ఈసారి టికెట్ కావాలంటున్నారు.

సీనియర్ నేతలే ఇలా టికెట్ల కోసం రచ్చ చేస్తుంటే.. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన శ్యామ్ నాయక్.. తన భార్య, ఎమ్మెల్యే రేఖా నాయక్ కి కూడా టికెట్ కావాలంటున్నారు. రేఖా నాయక్ కి ఈసారి బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో.. దంపతులిద్దరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్నారు. 


Tags:    
Advertisement

Similar News