కాంగ్రెస్ టికెట్ కావాలా..అప్లికేషన్ పెట్టు..ఫీజు ఎంతంటే..?
తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల ఖరారుపై చర్చ జోరందుకుంది. ఐతే ఈ సారి ఎన్నికలకు రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేయాలని ఆ పార్టీ డిసైడ్ అయింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల ఖరారుపై చర్చ జోరందుకుంది. ఐతే ఈ సారి ఎన్నికలకు రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేయాలని ఆ పార్టీ డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక అంశంపై తీవ్రంగా చర్చించారు. సెప్టెంబర్‌లో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ తరపున టికెట్ ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండడంతో...వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
ఇక అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సబ్‌కమిటీకి దామోదర రాజనర్సింహ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా...రోహిత్ చౌదరి, మహేష్ గౌడ్ సభ్యులుగా ఉన్నారు. విధివిధానాలు ఖరారు చేసేందుకు 17వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. 18 నుంచి 25వ తేదీ వరకు డీడీ రూపంలో రుసుము చెల్లించి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ అభ్యర్థులకు రూ.పది వేలు, బీసీ అభ్యర్థులకు రూ. 5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఇలా దరఖాస్తు చేసిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి.. సర్వే ఆధారంగా నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి ఏఐసీసీకి పంపాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఇలా పంపిన పేర్లలో ఒకరిని ఎంపిక చేసి.. మిగతా వారిని సముదాయించాలని పార్టీ భావిస్తోంది.
కర్ణాటకలో గెలుపు జోష్‌తో ఉన్న కాంగ్రెస్ అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. అధిష్టానం సూచనలతో టీకాంగ్రెస్ ముందుకెళ్తోంది. కలిసికట్టుగా ముందుకు సాగాలని..పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు సమాచారం.