దశాబ్ది ఉత్సవాల ముగింపు.. నేడు అమరుల సంస్మరణ
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. 21రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల చివరిరోజైన నేడు తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ సాధనలో అమరులైన ప్రతి ఉద్యమకారుడిని నేడు స్మరించుకుంటారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటారు. వారికి ఘన నివాళులర్పిస్తూ, స్మరిస్తూ.. ప్రజలు తెలంగాణ అభివృద్ధిలో పునరంకితమయ్యేలా ఈ కార్యక్రమాలు రూపొందించారు.
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటారు. హైదరాబాద్ లో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఆవిష్కరిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు.
అమరుల యాదిలో..
తెలంగాణ పోరులో అమరులైన వారిని స్మరించుకుంటూ నేడు అమరుల సంస్మరణ చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అమరుల సంస్మరణ కోసం ఎన్నో స్మారకాలు ఏర్పడ్డాయి. దాదాపుగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ నూతన స్మారక స్థూపాలు నిర్మించారు. వీటన్నిటికీ కేంద్రంగా హైదరాబాద్ లుంబినీ పార్కులో రూ.177.50 కోట్లతో తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని నిర్మించారు.