దీక్షా దివస్.... ఒక ఉద్యమ కెరటం

ఎన్నో అవమానాలు.. మ‌రెన్నో అవ‌హేళ‌న‌లు.. కుట్రలకు ఎదురునిలిచి ముందుకు సాగిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ రాజీలేని వైఖరిని తేటతెల్లం జేస్తుంది. స్పష్టమైన గమ్యం దిశగా ముందుకు సాగి విజయ తీరాలను చేర్చింది.

Advertisement
Update:2022-11-29 12:28 IST

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను యావత్ భారతదేశానికి చాటి చెప్పిన రోజు. చావో రేవో అంటూ కేసీఆర్ తన ప్రాణాలను లెక్కజేయకుండా తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు. ఇది తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక చిరస్మరణీయమైన రోజు. కులమతాలకు అతీతంగా తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఏకం జేసి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ముందుకు నడిపించిన రోజు. అణిచివేతలతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరు అంటూ తెలంగాణ పోరాట వారసత్వాన్ని మరోమారు ప్రపంచానికి చాటిన రోజు.

60 యేండ్ల తెలంగాణ ప్రజల బలీయమైన ఆకాంక్ష టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో సరికొత్త పంథాను ఎంచుకుంది. నీళ్లు- నిధులు - నియామకాలు నినాదంతో, తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ అనివార్యతని సృష్టించి.. దేశ ప్రజలను మెప్పించి తెలంగాణ సాధించాలన్న కేసీఆర్ సంకల్పంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ పురుడుపోసుకుంది. కానీ ఎన్నో అవమానాలు.. మ‌రెన్నో అవ‌హేళ‌న‌లు.. కుట్రలకు ఎదురునిలిచి ముందుకు సాగిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ రాజీలేని వైఖరిని తేటతెల్లం జేస్తుంది. స్పష్టమైన గమ్యం దిశగా ముందుకు సాగి విజయ తీరాలను చేర్చింది.

బక్కపలుచని వ్యక్తితో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు.. తెలంగాణ వచ్చేది లేదు అంటూ ఎగతాళిచేసిన వాళ్ళ ముఖం కేసీఆర్ సంకల్ప బలం ముందు వెలవెలబోయింది. నవంబర్ 29 రోజున కేసీఆర్ ఆమరణ దీక్షకు భంగం కలిగించి.. అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించడంతో యావత్ తెలంగాణ భగ్గుమంది, కేసీఆర్ అరెస్టును ఖండిస్తూ యావత్ తెలంగాణ రోడ్లమీదకు వచ్చింది. విద్యార్థి లోకం గర్జించింది. యువత పిడికిళ్లు బిగించి జై తెలంగాణ అంటూ నినదించింది. మహిళలు, ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టారు.

కేసీఆర్ పోరాట శైలి.. తెలంగాణ కోసం తన రాజీ లేని వైఖరి, మొండి పట్టుదల ముందు పాలకుల కుట్రలు పారలేదు. తెలంగాణ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన ఆందోళనను కలిగించింది. తమ‌ నాయకుడికి ఏమైపోతుందో అన్న భయం ఉద్యమాన్ని మరింత ప్రజ్వరిల్లేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విఘాతం కలిగించడానికి అప్పటి పాలకులు చేయని కుట్ర లేదు. వేయని పాచిక లేదు. కానీ తెలంగాణ బిడ్డ తెగువ ముందు అవన్నీ పనిచేయలేదు.

ఇక చేసేదేమి లేక కేంద్ర ప్రభుత్వం ఆగ‌మేఘాల మీద ముందుకు కదిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని డిసెంబ‌ర్‌ 9న అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించడం జరిగింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగినప్పటికీ తెలంగాణ ఓడిపోలేదు. దీక్షాదివస్ స్పూర్తితో 60యేండ్ల ప్రజల కాంక్షలను నిజం చేస్తూ.. 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.

Tags:    
Advertisement

Similar News