రేవంత్ రెడ్డిపై థరూర్ సెటైరికల్ ట్వీట్.. కారణం అదేనా..?

గతంలో రేవంత్, థరూర్‌ని గాడిద అంటూ విమర్శించారు. అప్పట్లో ఆయన సారీ చెప్పినా కూడా ఆ మంట ఇంకా చల్లారలేదని థరూర్ ట్వీట్లను బట్టి తెలుస్తోంది.

Advertisement
Update:2022-10-03 16:18 IST

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశిథరూర్ హైద‌రాబాద్‌లో పర్యటించారు. అయితే టీపీసీసీ నుంచి ఒక్క నాయకుడు కూడా ఆయనకు స్వాగతం పలకలేదు. కీలక నేతలెవరూ కనీసం విమానాశ్రయానికి కూడా వెళ్ళలేదు. ఈ క్రమంలో శశిథరూర్ తన హైద‌రాబాద్‌ పర్యటనపై ట్వీట్లు వేశారు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు తనకు ఘన స్వాగతం పలికారని చెపుతూనే.. రేవంత్ రెడ్డి రాలేదని చురకలంటించారు. రేవంత్ రెడ్డి తన బంధువుని కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ.. వచ్చేసారి కచ్చితంగా కలుద్దామని చెప్పారు.

రేవంత్ దూరం.. దూరం..

ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో మల్లికార్జున్ ఖర్గే అధిష్టానం మనిషి. శశిథరూర్ రెబల్ అభ్యర్థి. అందుకే టీపీసీసీ నేతలు శశిథరూర్ పర్యటనకు దూరంగా ఉన్నారు. కానీ రేవంత్ కాస్త తెలివిగా శశిథరూర్‌కి ముందస్తు సమాచారం పంపించారు. తన దగ్గరి బంధువు చనిపోయారని, అందుకే ఆయన్ని కలవలేక పోతున్నానని సమాచారం పంపించారు. రేవంత్ చెప్పినది నిజమే అయినా, అధిష్టానానికి వ్యతిరేకంగా ఉండలేకే ఆయన థరూర్ పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అసలు రేవంత్, థరూర్ మధ్య మరో పంచాయితీ కూడా ఉంది. గతంలో రేవంత్, థరూర్‌ని గాడిద అంటూ విమర్శించారు. అప్పట్లో ఆయన సారీ చెప్పినా కూడా ఆ మంట ఇంకా చల్లారలేదని థరూర్ ట్వీట్లను బట్టి తెలుస్తోంది.

ఇక హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన శశిథరూర్.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. ఖర్గేతో తాను కలిసి పనిచేశానని గుర్తుచేశారు. ఆయనతో తనది స్నేహపూర్వక పోటీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది ఒక కుటుంబంలో జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. తెలంగాణలో కూడా చాలా మంది నేతలతో తాను మాట్లాడనని చెప్పారు. రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్‌కు వస్తానని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News