షర్మిల కుమారుడి వివాహం ఫిక్స్.. - ట్వీట్ చేసిన షర్మిల
తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నామని, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని తన ట్వీట్లో షర్మిల పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె కుమారుడు రాజారెడ్డికి వివాహం ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల ట్వీట్ ద్వారా వెల్లడించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే.. తన కుమారుడి వివాహ సమాచారాన్ని కూడా ఆమె అందులో తెలియజేశారు.
ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు షర్మిల ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అంతేకాదు వధువు పేరు కూడా ఇందులో వెల్లడించారు. అట్లూరి ప్రియతో తన కుమారుడికి వివాహం జరగనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నామని, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని తన ట్వీట్లో షర్మిల పేర్కొన్నారు.
మంగళవారం అంటే జనవరి 2వ తేదీన తాము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తన తండ్రి ఆశీస్సులు తీసుకుంటానని వివరించారు. షర్మిల బ్రదర్ అనిల్ దంపతులకు మొత్తం ఇద్దరు సంతానం. ఒకరు రాజారెడ్డి, మరొకరు అంజిలి రెడ్డి.