కువైట్ వీసాల పేరిట 600 మందికి కుచ్చుటోపీ..!

రెండు నెల‌లుగా వేచిచూసిన బాధితులు వీసాల కోసం ఒత్తిడి చేయ‌గా.. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశాడు. సోమ‌వారం ఉద‌యం వీసాలు తీసుకుందామ‌ని వ‌చ్చిన బాధితుల‌కు ట్రావెల్స్ ఆఫీస్‌ మూసివుండ‌టం, బోర్డు కూడా లేక‌పోవ‌డంతో సుమారు 200 మంది డిచ్‌పల్లికి చేరుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2023-01-10 12:21 IST

కువైట్ వీసాల పేరిట 600 మందికి పైగా నిరుద్యోగుల‌ను నిండా ముంచేసిన వైనం నిజామాబాద్‌లో వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని ఆర్కే టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహ‌కుడు షేక్ బ‌షీర్ ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు. బాధితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిందితుడు బ‌షీర్ కువైట్ వీసాల పేరుతో బాధితుల వ‌ద్ద ఒక్కొక్క‌రి నుంచి రూ.20 వేల నుంచి రూ.60 వేల వ‌ర‌కు వ‌సూలు చేశాడు. అంతేగాక మెడిక‌ల్ చెక‌ప్‌ల పేరిట ఒక్కొక్క‌రి వ‌ద్ద రూ.5,600 తీసుకున్నాడు.

రెండు నెల‌లుగా వేచిచూసిన బాధితులు వీసాల కోసం ఒత్తిడి చేయ‌గా.. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశాడు. సోమ‌వారం ఉద‌యం వీసాలు తీసుకుందామ‌ని వ‌చ్చిన బాధితుల‌కు ట్రావెల్స్ ఆఫీస్‌ మూసివుండ‌టం, బోర్డు కూడా లేక‌పోవ‌డంతో సుమారు 200 మంది డిచ్‌పల్లికి చేరుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అనంత‌రం ట్రావెల్స్‌లో ప‌నిచేసే రాంపూర్ గ్రామానికి చెందిన లింబాద్రిని ప‌ట్టుకొని బ‌షీర్ వివ‌రాలు చెప్పాల‌ని నిల‌దీశారు. తాను కేవ‌లం జీతానికి ప‌నిచేశాన‌ని, అత‌ను మోసం చేస్తాడ‌ని త‌న‌కు తెలియ‌ద‌ని లింబాద్రి చెప్ప‌డంతో.. వారంతా క‌లిసి డిచ్‌ప‌ల్లి - నిజామాబాద్ హైవేపైకి చేరుకొని రాస్తారోకో నిర్వ‌హించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

మెడిక‌ల్ టెస్టుల కోసం రూ.5,600 వ‌సూలు చేసిన జిల్లా కేంద్రంలోని విజ‌య‌శ్రీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌పైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితులు డిమాండ్ చేశారు. డిచ్‌ప‌ల్లి ఎస్ఐ కె.గ‌ణేష్ అక్క‌డికి చేరుకొని బాధితుల‌కు న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో ఆందోళ‌న విర‌మించారు. బ‌షీర్ ఇంటి య‌జ‌మానిని ఆరా తీయ‌గా, త‌న‌కు కూడా రెండు నెల‌లు అద్దె ఎగ్గొట్టాడ‌ని అత‌ను వెల్ల‌డించాడు. బ‌షీర్ ఎడ‌ప‌ల్లి మండ‌లం ఎంఎస్ ఫారం గ్రామానికి చెందిన‌వాడ‌ని ప‌లువురు బాధితులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News