ఓ పొన్నాల లక్ష్మయ్య.. ఓ కేశవరావు
బిఆర్‌ఎస్‌లో అన్నిరకాల గుర్తింపును, పదవులను అనుభవించిన కేశవరావు ఈ ముదిమి వయసులో సొంత గూటికి చేరాలనుకుంటున్నట్టు చెబితే నవ్విపోరా? 80 ఏళ్ళ పొన్నాల లక్ష్మయ్యకు, 84 ఏళ్ళ కేశవరావుకు తేడా ఏమిటి? ఈ వయసులో కేశవరావుకు పార్టీ మారాల్సిన అవసరం ఏమిటి?
చచ్చే ముందు పార్టీ మారడం ఏమిటి, కాంగ్రెస్ నీకు ఏం తక్కువ చేసిందంటూ ఆర్నెల్ల కిందట పొన్నాల లక్ష్మయ్య మీద విరుచుకుపడ్డారు రేవంత్‌రెడ్డి. 80 ఏళ్ళ వయసులో ఇదేం బుద్ధి అని ఈసడించారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యను పార్టీని వీడినందుకు అనరాని మాటలు అనడం తెలిసిందే. ఇపుడు అదే రేవంత్‌రెడ్డి 84 ఏళ్ళ వయసులో ఉన్న కె. కేశవరావును బిఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించారు. అందుకు ఆయన సిద్ధపడ్డారు, మర్యాద పూర్వకంగా కెసిఆర్‌ను కలుసుకొని తన నిర్ణయాన్ని చెప్పారు.
పుష్కరకాలం పాటు బిఆర్‌ఎస్‌లో అన్నిరకాల పదవులను, పెద్దరికాన్ని, గౌరవాన్ని పొందిన కె.కేశవరావు ఇపుడు ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేస్తాననడం కెసీఆర్‌కు మింగుడు పడకపోవటం సహజమే. ఎందుకంటే కేశవరావును ఓ సీనియర్ రాజకీయవేత్తగా కెసీఆర్ గౌరవించారు. పార్టీ సెక్రటరీ జనరల్ పదవిని ఇచ్చారు, రాజ్యసభకు రెండుసార్లు పంపించారు. రాజ్యసభలో బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నాయకునిగా నియమించారు. ఆయన కూతురు విజయలక్ష్మిని జిహెచ్‌ఎంసి మేయర్‌ను చేశారు. ఇప్పటికీ బిఆర్‌ఎస్ నుంచే ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
బిఆర్‌ఎస్‌లో అన్నిరకాల గుర్తింపును, పదవులను అనుభవించిన కేశవరావు ఈ ముదిమి వయసులో సొంత గూటికి చేరాలనుకుంటున్నట్టు చెబితే నవ్విపోరా? 80 ఏళ్ళ పొన్నాల లక్ష్మయ్యకు, 84 ఏళ్ళ కేశవరావుకు తేడా ఏమిటి? ఈ వయసులో కేశవరావుకు పార్టీ మారాల్సిన అవసరం ఏమిటి? పార్టీ మారడం వల్ల ఆయనకు ఏమైనా గొప్ప పదవి, అత్యున్నత రాజకీయ భవిష్యత్తు ప్రాప్తిస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో కురువృద్ధుడైన కేశవరావు బిఆర్‌ఎస్‌ను వీడతారనే మాట పరిశీలకుల్ని విస్మయానికి లోను చేస్తున్నది.
కేశవరావుతో పోలిస్తే ఇంకా పొన్నాల లక్ష్మయ్యనే నయం కదా అనిపిస్తుంది. ఎందుకంటే కేశవరావు మాదిరిగా ఏరుదాటాక తెప్ప తగలెయ్యలేదు. పొన్నాల అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే రాజీనామా చేశారు. కారణాలు ఏమైనా కావచ్చు. కాని పొన్నాల లక్ష్మయ్య ముందస్తు రాజీనామా గౌరవప్రదమైంది. కానీ ఇపుడు బిఆర్‌ఎస్‌ను కేశవరావు వీడటం మాత్రం సూత్రప్రాయంగా తప్పంటున్నారు సీనియర్ రాజకీయవేత్తలు.
బిఆర్‌ఎస్ ఓటమికి గల కారణాల్ని కూడా కెసీఆర్‌తో కేశవరావు చర్చించారని చెబుతున్నారు. కెసీఆర్ వైఖరి వల్లనే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిందని చెప్పారనే మాట వినిపిస్తున్నది. అందుకని ఇపుడు బిఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి కేశవరావు సిద్ధపడటం అవకాశవాదమే అవుతుంది. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాజీనామా చేసినా అర్థం ఉండేది. కానీ ఇపుడు కాంగ్రెస్ తాయిలాలకు ఆశపడి బిఆర్‌ఎస్‌కు బై చెప్పడానికి కేశవరావు సిద్ధపడుతుంటే 84 ఏళ్ళ వయసులో ఇదేం బుద్ధి అని జనాలు అనుకోరా? 84 ఏళ్ళ ఆ పెద్దాయన వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమిటి? పొన్నాల విషయంలో ఓ సూత్రం, కేశవరావు విషయంలో మరో సూత్రమా? ఇదేం పద్ధతి రేవంత్ అని జనాలు ప్రశ్నించరా?
సరిగ్గా ఆర్నెల్ల కిందట గత అక్టోబర్‌లో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరినప్పుడు రేవంత్‌రెడ్డి తిట్ల దండకం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. దాదాపు పుష్కరకాలం పాటు బిఆర్‌ఎస్‌లో పదవులనుభవించిన 84 ఏళ్ళ కేశవరావును చేర్చుకోడం కాంగ్రెస్‌కు ఏవిధంగా లాభిస్తుందో రేవంత్‌రెడ్డి చెప్పగలరా? ఇది ఏ రాజకీయ విలువలకు, ఏ రాజకీయ సంస్కృతికి అనువైనదో ఆయన వివరిస్తారా?