రైతులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్

పంటల బీమా అమల్లోకి వస్తే ప్రకృతి విపత్తులతో నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం అందుతుంది. పంటల బీమాలో రైతులు నామమాత్రపు ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో బీమా కంపెనీలకు తన వాటాగా చెల్లిస్తుంది.

Advertisement
Update:2023-12-25 11:53 IST

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది రేవంత్ ప్రభుత్వం. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనూ పంటల బీమా పథకం అమలుకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. రైతు యూనిట్‌గా పథకానికి రూపకల్పన చేస్తున్నారు. వచ్చే వానకాలం నుంచే బీమా అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఓ నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు.

రైతులకు పంట బీమా ఇలా..

పంటల బీమా అమల్లోకి వస్తే ప్రకృతి విపత్తులతో నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం అందుతుంది. పంటల బీమాలో రైతులు నామమాత్రపు ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో బీమా కంపెనీలకు తన వాటాగా చెల్లిస్తుంది. ఏదైనా విపత్తు జరిగినప్పుడు వ్యవసాయ అధికారులు వచ్చి పంటను పరిశీలిస్తారు. నష్టాన్ని అంచనా వేసి బీమా కంపెనీలకు నివేదిక పంపుతారు. అప్పుడు బీమా కంపెనీలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తాయి.

పంటల బీమా లేక రైతుల కష్టాలు

కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం కొనసాగింది. దీనివల్ల రైతులకంటే కంపెనీలే బాగుపడుతున్నాయన్న భావనతో కేసీఆర్ ప్రభుత్వం 2020లో ఫసల్‌ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందే అవకాశమే లేకుండా పోయింది. ఈనెల మొదటివారంలో కూడా రాష్ట్రంలో తుపాను కారణంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ, రైతులకు ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. ఇలా ప్రతీ ఏటా రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫసల్‌ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా పంటల బీమా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది రేవంత్ సర్కారు. బెంగాల్‌లో ఇలాంటి పథకమే విజయవంతంగా అమలవుతోంది.

Tags:    
Advertisement

Similar News