గుజరాత్ కు వరాల వర్షం... తెలంగాణకు మొండి హస్తం

నరేంద్ర మోడీ దేశానికి ప్రధానిలా కాక గుజరాత్ కు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రధానిలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్ కు లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న మోడీ తెలంగాణ వంటి విపక్ష పాలిత రాష్ట్రాలను మాత్రం పట్టించుకోవడం లేదు.

Advertisement
Update:2022-10-14 13:52 IST

ఉచితాలు వద్దు అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు గుజరాత్ పై ఉచితాల వర్షం కురిపిస్తున్నారు. త్వరలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తన స్వంత రాష్ట్రంపై మోడీ అలవిగాని ప్రేమ చూయిస్తున్నారు. తన రాష్ట్రంపై ప్రేమ చూయించడం తప్ప కాదు కాని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూయించడంలోనే అసలు సమస్యంతా.

గుజరాత్ లో తన తాజా పర్యటనలో ప్రధాని మోడీ రూ. 29,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు, ఇందులో భావ్‌నగర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG టెర్మినల్, అహ్మదాబాద్‌లోని మెట్రో రైల్ మొదటి దశ, సూరత్ లో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీ మొదటి దశ ఉన్నాయి.

మరోవైపు, ఈ పెట్టుబడుల వర్షంతో పాటు, ఎన్నికల నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో 'ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' (పిఎంజికెఎవై) పథకాన్ని కూడా పొడిగించారు మోడీ. దీనివల్ల‌ కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది.

ఆయన దేశానికి ప్రధానిలా కాక గుజరాత్ కు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రధానిలా వ్యవహరిస్తున్నారు.

2021లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మోడీ యూపీకి అనేక కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. రూ. 22,497 కోట్లతో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రధాని ఉచితాల సంస్కృతి గురించి మాట్లాడలేదు.

కేవలం ఆరు నెలల్లోనే గుజరాత్‌కు రూ.80,000 కోట్ల నిధులు కేటాయించిన ప్రధాని అదే సమయంలో, ఇతర రాష్ట్రాలు విషయంలో వివక్షతో వ్యవహరిస్తున్నారు. తమ న్యాయబద్ధమైన గ్రాంట్‌ల కోసం కూడా విపక్షపాలిత రాష్ట్రాలు అభ్యర్థించాల్సి వస్తోంది. ప్రాదేయపడాల్సి వస్తోంది. అయినా కేంద్రం రిక్తహస్తాలే చూపిస్తోంది. తెలంగాణ విషయాన్నే తీసుకుంటే, మిషన్ భగీరథ నిర్వహణ కోసం రూ.2,350 కోట్లు మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. అయినా కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు.

కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన రూ.34,149.71 కోట్ల గ్రాంట్లు, ఇతర నిధుల కోసం పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అనేక ప్రాజెక్టులను పదే పదే తిరస్కరిస్తోంది.

యుపిఎ ప్రభుత్వం 2013లో హైదరాబాద్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్) ప్రాజెక్ట్ కు అనుమతి మంజూరు చేసి రూ.165 కోట్లు విడుదల చేసింది. 4,863 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 3.11 లక్షల కోట్ల ప్రత్యక్ష ఆదాయం, రూ. 2.35 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల వృద్ధి, 15 లక్షల‌ మందికి ప్రత్యక్ష ఉపాధి, 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 30,000 కోట్లకు పైగా పన్ను ఆదాయం పెరగుతుందని అంచనా వేశారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన డబ్ల్యూహెచ్‌ఓ-గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వరంగల్‌లోని కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన రైలు కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం మహారాష్ట్రలోని లాతూర్‌కు తరలించింది.

తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్ష, గుజరాత్ పట్ల చూపిస్తున్న‌ పక్షపాత వైఖరిని ఖండిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు ''ఇది ప్రజాస్వామ్యమా, మోడీక్రసీనా, వంచనా? మోడీ గుజరాత్ కు మాత్రమే ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారు. ఉచితాల మీద విమర్శలు చేసిన ఆయన చేస్తున్నది ఉచితాల పంపకం కాదా'' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News