భలే ఐడియా.. దళిత బంధుతో సరికొత్త ఉపాధి..

తాజాగా 9మంది లబ్ధిదారులు సరికొత్త ఉపాధి మార్గం ఎంచుకున్నారు. "డాగ్ గ్రూమింగ్ డోర్ స్టెప్ సర్వీస్" అనే పేరుతో వాహనాలను లీజుకివ్వడం మొదలు పెట్టారు.

Advertisement
Update:2022-07-27 07:18 IST

ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకునేవారుంటారు, దుర్వినియోగం చేసుకునేవారుంటారు. తెలంగాణ దళితబంధు పథ‌కం ద్వారా పెద్దమొత్తంలో ఆర్థిక సాయం చేయడంతోపాటు, ప్రభుత్వ పర్యవేక్షణ కూడా సక్రమంగా ఉండటంతో లబ్ధిదారులు మొదటి నెలనుంచే ఆదాయ మార్గాలను సృష్టించుకుంటున్నారు. 10లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వారంతా సద్వినియోగ పరచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ చాలామంది వ్యాపారాలు మొదలు పెట్టారు, కుటీర పరిశ్రమలు స్థాపించారు. తాజాగా 9మంది లబ్ధిదారులు సరికొత్త ఉపాధి మార్గం ఎంచుకున్నారు. "డాగ్ గ్రూమింగ్ డోర్ స్టెప్ సర్వీస్" అనే పేరుతో వాహనాలను లీజుకివ్వడం మొదలు పెట్టారు.

ఏంటీ వాహనాలు..?

సంగారెడ్డి ఆందోల్ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులు.. సరికొత్త ఆలోచన చేశారు. దళిత బంధు పథకం కింద వచ్చిన డబ్బులతో సెకండ్ హ్యాండ్ వాహనాల్ని కొనుగోలు చేశారు. వాటికి మెరుగులు దిద్ది, డాగ్ గ్రూమింగ్ డోర్ స్టెప్‌ వాహనాలుగా మార్చేశారు. ఈ వాహనాల్లో పెంపుడు కుక్కలకి అవసరమైన సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఈ అంబులెన్స్ తరహా వాహనాలు ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తాయి. ప్రస్తుతం పట్టణాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో వీటివైపు మొగ్గు చూపారు లబ్ధిదారులు. నెలకి 30వేలనుంచి 40వేల రూపాయల వరకు లీజు వస్తుందని సంతోషంగా చెబుతున్నారు.

హైదరాబాద్‌ కు చెందిన వెటర్నరీ డాక్టర్ మురళీధర్‌ ఈ కొత్త ఉపాధి ఆలోచనను లబ్ధిదారులకు చెప్పి ఒప్పించారు. ప్రస్తుతం 9మంది లబ్ధిదారుల వద్ద ఉన్న వాహనాలను ఆయనే లీజుకి తీసుకుంటున్నారు. ఈ వాహనాలను గచ్చిబౌలిలో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నుంచి వచ్చిన లబ్ధిదారులు.. హైదరాబాద్ లో పెట్ గ్రూమింగ్‌తో ఉపాధి అవకాశాలు పెంచుకుంటున్నారని అన్నారు హరీష్ రావు. త్వరలోనే ఇలాంటి డాగ్ గ్రూమింగ్ వాహనాలను తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రారంభించే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News