హైదరాబాద్‌లో 25 రోజులు పవర్ కట్స్
Power cuts in Hyderabad: ప్రస్తుతం చలికాలం. విద్యుత్ వినియోగం పెద్దగా ఉండదు. ఏసీలు, కూలర్లు మూలన పడి ఉంటాయి. కానీ వచ్చేది ఎండాకాలం, సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉంటుంది.
హైదరాబాద్‌లో నేటి నుంచి కరెంటు కోతలు మొదలు కాబోతున్నాయి. వచ్చేనెల 10వ తేదీ వరకు నగరంలో పవర్ కట్స్ ఉంటాయి. HMDA పరిధిలోని సబ్ స్టేషన్ల నిర్వహణ, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్ల నిర్వహణ, చెట్ల నరికివేత కోసం 2 గంటల పాటు విద్యుత్ కోత విధించేందుకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఒక్కో ప్రాంతంలో 15 నిమిషాల నుంచి గరిష్టంగా రెండు గంటలపాటు విద్యుత్‌ను నిలిపేస్తామని అధికారులు ప్రకటనలో తెలిపారు.
ఆదివారాలు, పండుగల నాడు తప్ప మిగతా అన్నిరోజులు పవర్ కట్స్ ఉంటాయి. మొత్తం ఒకేసారి కాకుండా, జనాలకు ఇబ్బంది కలగకుండా వివిధ సబ్ స్టేషన్ పరిధిలో రొటేషన్ పద్ధతిలో రిపేర్లు చేస్తారు. ఏరియాల వారీగా విద్యుత్ కోత సమయాల షెడ్యూల్‌ను ముందురోజు సాయంత్రం 4 గంటలకు TSSPDCL వెబ్‌సైట్‌లో పెడుతామని అధికారులు తెలిపారు. నిర్వహణ పనులు చేపట్టే ప్రాంతంలోని విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని TSSPDCL కోరింది.
ప్రస్తుతం చలికాలం. విద్యుత్ వినియోగం పెద్దగా ఉండదు. ఏసీలు, కూలర్లు మూలన పడి ఉంటాయి. కానీ వచ్చేది ఎండాకాలం, సమ్మర్‌లో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే తగిన ఏర్పాట్లు చేస్తుంటారు అధికారులు. ఇదేం కొత్త కాదు, ఏటా జరిగే కార్యక్రమే. ప్రతిసారి నవంబర్-జనవరి మధ్య ఈ పనులు ఉంటాయి. కానీ, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యమైనట్టు TSSPDCL తెలిపింది. కరెంట్ కోతల ప్రకటనపై హైదరాబాద్ వాసుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. కొందరైతే సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు.