మోదీ మాటలు నీటి మూటలు.. హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లు..

సరిగ్గా నీతి ఆయోగ్ సమావేశం మొదలైన రోజునే.. హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. 2022నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అనే హామీ ఏమైందని ఆ పోస్టర్లలో సూటిగా ప్రశ్నించారు.

Advertisement
Update:2022-08-08 07:22 IST

ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయడం నాయకులకు అలవాటే. అలవి మాలిన వాగ్దానాలు చేసేవారు కూడా ఉంటారు. కానీ వాటిలో కాస్తో కూస్తో నెరవేర్చేవారినే ఇప్పటి వరకూ చూశాం. కేవలం మాటలు చెప్పి, మభ్యపెట్టి, చివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వరుసగా రెండేళ్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చడంలోనూ ఆయన సఫలం కాలేదు. పైపెచ్చు ఆయన చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి, దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను విరిచేశాయి. దేశవ్యాప్తంగా మోదీపై ఇప్పుడు ఎదురుదాడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉన్న ఈ సమయంలో మోదీజీ మీ హామీలు ఏమయ్యాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ లో పోస్టర్లు..

సోషల్ మీడియాలో ఇప్పటికే "క్యా హువా తేరా వాదా?" అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికితోడు తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణులు మోదీని బ్యాన‌ర్ల‌కి ఎక్కించేశారు. ఆ మధ్య మోదీ హైదరాబాద్ కి వచ్చిన సందర్భంలో కూడా ఇలాగే పరువు తీశారు, ఇప్పుడు మరోసారి నగరంలో పోస్టర్లు వేసి మరీ మోదీని నిలదీస్తున్నారు.

సరిగ్గా నీతి ఆయోగ్ సమావేశం మొదలైన రోజునే.. హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. 2022నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అనే హామీ ఏమైందని ఆ పోస్టర్లలో సూటిగా ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ ఎంతమేరకు నెరవేరింది..? భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తానన్న వాగ్దానం ఎంతవరకు వచ్చింది..? మోదీజీ.. మీ వాగ్దానాలు ఏమయ్యాయి..? అంటూ పోస్టర్లు వెలిశాయి.

వీటిపై స్పందించడానికి బీజేపీ నేతలకు ధైర్యం సరిపోవడంలేదు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలంటే కచ్చితంగా వారి వద్ద సమాధానం ఉండాలి. మోదీ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు, కనీసం ఆ దిశగా అడుగులు కూడా పడలేదు కాబట్టి బీజేపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News