తెలంగాణలో పోలింగ్ సందడి మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ మరికాసేపట్లో మొదలవుతుంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3.26 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ సారి యువ ఓటర్ల సంఖ్య భారీగా ఉంది. కొత్తగా 9,99,667 మందికి ఓటు హక్కు లభించింది. వీరంతా తొలిసారి పోలింగ్ బూత్ లకు వస్తారు.
పోలింగ్ లెక్కలు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 59,799 పోలింగ్ యూనిట్లు ఇందులో ఉంటాయి. 56,592కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి. 27,051 చోట్ల ఓటింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఇక బందోబస్తుకి 75 వేల మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 40 వేల మంది పోలీసులు, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15 వేల మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను తెలంగాణవ్యాప్తంగా మోహరించారు.
13 అసెంబ్లీ నియోజకవర్గాలను తీవ్ర ప్రభావితమైనవిగా గుర్తించారు. 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు 3,800 మంది సెక్టార్ ఆఫీసర్లను, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.
*