మరో ఛాన్స్ : ఓటు నమోదు చేసుకోండి.. తప్పులు సరిచేయించండి

జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే డోర్‌ నెంబర్‌తో ఉండే మల్టిపుల్ పోర్షన్స్, అపార్ట్‌మెంట్‌లలో వేరే వేరు కుటుంబాలు ఓటర్లుగా ఉంటే.. వాళ్లు ఆ ఫ్లోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్‌తో ఓటర్ కార్డు అప్డేట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.

Advertisement
Update:2023-05-28 17:00 IST

తెలంగాణ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో కొత్త ఓటరు నమోదుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మరోసారి ఛాన్స్ ఇచ్చింది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్లు కూడా ఇప్పుడే ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వరుసగా ఎన్నికలు ఉండటంతో స్పెషల్ సమ్మర్ రివిజన్-2023 పేరుతో ఓటు హక్కు నమోదుకు మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 25 నుంచే బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎస్ఓ) ఇంటింటి సర్వే మొదలు పెట్టారు. జూన్ 23 వరకు ఈ సర్వే సాగనుండగా.. చనిపోయిన, డబుల్ ఓటర్లను తొలగించి.. సవరణ జాబితాను అక్టోబర్ 4న ప్రకటించనున్నారు.

జూన్ 24 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో పరిశీలిస్తారు. దీంతో పాటు ఓటరు జాబితా మార్పులు, చేర్పులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలపై నిర్ణయం తీసుకుంటారు. పాత పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించడం.. అసరం అయితే అదనపు పోలింగ్ కేంద్రాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడం బీఎల్ఓల బాధ్యతే.

ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారి కోసం బీఎల్‌ఓలు కొత్తగా దరఖాస్తులు చేయిస్తారు. రెండు ఓట్లు ఉన్నా, చనిపోయినా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. వారి వివరాలు సేకరిస్తారు. డబ్లింగ్, డెత్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తారు. డబ్లింగ్ ఉంటే వారు కోరుకున్న చోట మాత్రమే ఓటు హక్కు ఉంచుతారు. ఇక ఓటరు కార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. అడ్రస్ మారితే కూడా కొత్త చిరునామాకు ఓటు హక్కును బదిలీ చేస్తారు.

కొత్త ఓటర్లు జూలై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించిన తర్వాత ఆగస్టు 2న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. అగస్టు 2 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రతీ రెండో శనివారం, ఆదివారం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు.

హైదరాబాద్ ఓటర్లకు సీఈవో సూచన:

జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే డోర్‌ నెంబర్‌తో ఉండే మల్టిపుల్ పోర్షన్స్, అపార్ట్‌మెంట్‌లలో వేరే వేరు కుటుంబాలు ఓటర్లుగా ఉంటే.. వాళ్లు ఆ ఫ్లోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్‌తో ఓటర్ కార్డు అప్డేట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ఫామ్-8 ఉపయోగించి సరైన చిరునామా అప్‌డేట్ చేసుకోవడానికి బీఎల్ఓలు సహాయపడతారని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు.

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు కావడంతో తెలంగాణలోని రాజకీయ పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీలో తమ కార్యకర్తలకు కొత్త ఓటర్లను గుర్తించాలని చెప్పాయి. వారి చేత దరఖాస్తు చేయించి.. ఓటరుగా నమోదు చేయించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చాయి. డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో.. కొత్త ఓటర్ల నమోదు కీలకంగా మారింది. నియోజకవర్గంలో కనీసం 2 నుంచి 4 వేల మంది కొత్త ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. యువత ఓట్లు తప్పకుండా ఈ సారి కీలకంగా మారనుండటంతో కొత్త ఓటర్ల నమోదుపై ఆయా పార్టీలు దృష్టి పెట్టాయి.



 


Tags:    
Advertisement

Similar News