ఓటర్ స్లిప్ లేదా? ఇలా చేయండి చాలు!
ఎన్నికల సమయంలో కొంతమందికి పోలింగ్ ముందురోజు వరకూ ఓటర్ స్లిప్‌లు అందకపోవచ్చు. అలాంటప్పుడు ఓటింగ్ మానుకోకుండా సింపుల్‌గా ఇలా చేయండి చాలు.
ఎన్నికల సమయంలో కొంతమందికి పోలింగ్ ముందురోజు వరకూ ఓటర్ స్లిప్‌లు అందకపోవచ్చు. అలాంటప్పుడు ఓటింగ్ మానుకోకుండా సింపుల్‌గా ఇలా చేయండి చాలు.
ఓటు వేయడానికి ఓటర్ స్లిప్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ పేరు ఏ పోలింగ్ సెంటర్‌లో ఉందో తెలుసుకుంటే చాలు. అక్కడికి వెళ్లి ఓటర్ ఫొటో గుర్తింపుకార్డు లేదా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఫొటోతో ఉన్న బ్యాంకు పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం కార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, పింఛను పత్రం.. ఇలా ఎన్నికల శాఖ ఆమోదించిన 21 రకాల పత్రాల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు.
ఓటర్ వివరాలు, ఐడీ నెంబర్, పోలింగ్ సెంటర్ వివరాల వంటివి ఓటర్ స్లిప్‌లో పొందిపరచి ఓటర్లకు అందిస్తుంటారు. అయితే ఏవైనా కారణాల చేత ఓటర్ స్లిప్ అందకపోతే ఓటరు ఐడీ నంబర్‌ను ‘1950’ లేదా ‘92117 28082’ నంబర్‌కు మెసేజ్ చేస్తే.. వెంటనే మీ పోలింగ్ కేంద్రం వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. లేదా 1950 నెంబర్ కు కాల్ చేసి కూడా పోలింగ్ సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటర్ స్లిప్ లేకపోతే ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా పోలింగ్ సెంటర్, సీరియల్ నెంబర్ వంటి వివరాలు పొందొచ్చు. అలాగే ఎలక్షన్ కమీషన్ వెబ్‌సైట్ ‘ceotelangana.nic.in’ ద్వారా కూడా పోలింగ్ కేంద్రం అడ్రెస్, గూగుల్ మ్యాప్ లొకేషన్‌తో సహా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.