నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్... కొందరు జర్నలిస్టులను బైటికి వెళ్ళగొట్టిన బీజేపీ నేతలు
ప్రశ్న అంటేనే భయపడే బీజేపీ నేతలు మీడియా సమావేశం నుండి తమను ప్రశ్నిస్తారనే అనుమానం ఉన్న కొందరు జర్నలిస్టులను బైటికి వెళ్ళగొట్టారు. ఈ రోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ సంఘటన జరిగింది.
భారతీయ జనతా పార్టీ ఎంత అప్రజాస్వామికంగా ఉంటుందో రోజుకు ఎన్నో సంఘటనలు రుజువు చేస్తుంటాయి. ఆ పార్టీ ప్రతిరోజూ ఎంత మందిని అవమానిస్తుందో లెక్కేలేదు. ఈ రోజు అలా అవమానం జర్నలిస్టులకు జరిగింది. ప్రశ్నించేవారి గొంతు నొక్కే బీజేపీ ఈరోజు కొందరు జర్నలిస్టులను నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నుండి అవమానకరంగా బైటికి పంపించేసింది.
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాసమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశానికి దాదాపుగా అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
ఇంకా రెండు నిమిషాల్లో ఆమె సమావేశం ప్రారంభిస్తారనగా కొందరు జర్నలిస్టులను బీజేపీ నాయకులు బలవంతంగా బైటికి పంపించేశారు. అదేదో గొప్ప కార్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో బహిరంగంగానే ప్రకటించారు. వాళ్ళు పొంతన లేని ప్రశ్నలు అడిగి విసిగిస్తారని,అనవసర రాద్దాంతం చేస్తారని అందుకే బైటికి పంపేశామని ఆయన అన్నారు.
వాళ్ళకు నచ్చని ప్రశ్నలు అడగడం రాజకీయ నాయకులకు విసుగు తెప్పించడం సహజమే, గట్టిగా అడిగితే అది రాద్దాంతంలాగే అనిపిస్తుంది. ప్రశ్నకే భయపడేవారు ఎంత నిరంకుశంగా ఉంటారో ప్రపంచ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ప్రశ్న అంటే ఇంతగా భయపడుతున్న బీజేపీ నాయకులు ప్రజల నోరు మూయించడం, గొంతు నొక్కడం , జైళ్ళలోకి నెట్టడం అలవాటుగా మార్చుకుంది. ఇప్పటికే దేశంలో ఎంతో మంది జర్నలిస్టులను జైళ్ళపాలు చేసిన బీజేపీ రేపు పొరపాటున తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించడానికే భయంకరంగా లేదూ!